Marriage : పెళ్లి చేసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. లక్ష నుంచి కోటి వరకు ఛాన్స్..
marriage : ఒక సంప్రదాయ సామెత ఉంది గుర్తుందనుకుంటున్నా.. ‘ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’. ప్రస్తుతం వివాహం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ మధ్య మనం చూసిన ఒక హై ఫ్రొఫైల్ పర్సన్ అంబానీ ఇంట పెళ్లి కి అక్షరాలా రూ. 5000 కోట్లు ఖర్చయినట్లు వార్తలు వచ్చాయి. ప్రీ వెడ్డింగ్ తో మొదలు పెట్టి రిసెప్షన్ వరకు నిత్యం ఖర్చే. వివాహం జీవితంలో ఒకటే సారి జరుగుతుంది. కాబట్టి దాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకునేందుకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు.
లేని వారి పరిస్థితి..
డబ్బున్న వారు ఎలాగైనా భారీగా చేసుకుంటారు. మరి డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి. వారు కూడా ఘనంగా చేసుకునేందుకే ఇష్టపడతారు. దీని కోసం అప్పులు కూడా చేస్తారు. అయితే, మన బ్యాంకింగ్ రంగంలో ఇలా వివాహాల కోసం లోన్లు ఇచ్చే వ్యవస్థ లేదు. వివాహం చేసుకునే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లోన్ ఇచ్చే సౌకర్యాన్ని తీసుకువచ్చింది ‘మ్యాట్రిమోనీ. కామ్.’
పెళ్లి ఖర్చుల కోసం రుణాలు..
ఇప్పటి వరకు సంబంధాలను మాత్రమే కుదిర్చే మ్యాట్రిమోనీ సంస్థ ఇకపై పెళ్లి చేసుకుంటామని ఖర్చుల కోసం లోన్లను కూడా ఇస్తుందట. దీని కోసం వెడ్డింగ్ లోన్స్.కామ్ అనే ఫిన్ టెక్ వేదిక ప్రారంభించింది. టాటా క్యాపిటల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ, వాటి ఫైనాన్స్ సంస్థలతో వెడ్డింగ్ లోన్స్.కామ్ ఒప్పందం కుదుర్చుకుంది.
లక్ష నుంచి కోటి వరకు..
వివాహం చేసుకునేందుకు వెడ్డింగ్ లోన్స్.కామ్ లక్ష నుంచి కోటి రూపాయల వరకు లోన్ ఇవ్వనుంది. దీని కోసం నెల వారి ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంది. నిబంధనల ప్రకారమే లోన్లు ఇస్తుంది. ఈ లోన్లకు 30 సంవత్సరాలు, అంత కంటే ఎక్కువ కూడా ఈఎంఐల రూపంలో వసూలు చేయనుంది. ఈ పెళ్లిళ్ల సీజన్ లోనే ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు పేర్కొంది.
జాగ్రత్త అవసరం..
పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకునే వారు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వారికి ఇది చక్కటి వేదిక. అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి కష్టాలు పడాల్సిన అవసరం లేదని కొందరి వాదన. ఉన్నంతలో చేయవచ్చని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇల్లు కోసం లోన్లు ఇచ్చే వ్యవస్థ నుంచి, పెళ్లి కోసం లోన్లు తీసుకునే వ్యవస్థలోకి మారడం ఆశ్చర్యమే. కానీ లోన్ తీసుకోవాలనుకునే వారు కూలంకషంగా తెలుసుకున్నాకే తీసుకోవడం మంచిది.