Election officer : ఎన్నికల అధికారిపై దాడి చేసిన స్వతంత్ర అభ్యర్థి అరెస్టు
election officer : రాజస్థాన్ లో ఎన్నికల అధికారిపై దాడి చేసిన స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనాను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. టోంక్ జిల్లాలోని సమరావత్ గ్రామంలో బుధవారం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అమిత చౌదరిపై నరేశ్ మీనా దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్న విషయం తెలిసిందే. అనంతరం ధర్నాకు దిగిన నరేశ్ మీనా, ఆయన మద్దతుదారులను అడ్డుకునేందుకు యత్నించడంతో బుధవారం సాయంత్రం జిల్లాలో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. పోలీసులపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేశాయి. పలు వాహనాలకు నిప్పంటించాయి.
గురువారం ఉదయం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మరోమారు రంగంలోకి దిగిన పోలీసులు గురువారం నరేశ్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 60 మందిని అరెస్టు చేశారు. నరేశ్ మీనా అరెస్టు అనంతరం ఆందోళనలు జరిగిన ప్రాంతానికి వెళ్లిన పీటీఐ పాత్రికేయుడు, కెమెరామెన్ లపై ఓ ముఠా దాడి చేసింది. వారి కెమెరాను లాక్కొని నిప్పంటించింది. ఈ దాడిలో పాత్రికేయుడు అజిత్ షెకావత్, కెమెరామన్ ధర్మేంద్ర కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.