wedding ceremony : వివాహ వేడుకలో కొండచిలువ.. పట్టుకున్న అటవీ శాఖ అధికారులు
wedding ceremony : కొవ్వూరు కాశీవిశ్వేశ్వరస్వామి పంచాయతన శివాలయ మండపంలో బుధవారం రాత్రి కొండచిలువ హల్ చల్ చేసింది. గోదావరి గట్టుపై సుబ్రహ్మణ్యేశ్వర స్నానఘాట్ లోని పై అంతస్తులో శివాలయం, కింది భాగంలో కల్యాణ మండపం, వేదిక ఉన్నాయి. రాత్రి ఓ పెళ్లి జరుగుతుండగా గోడ పక్కగా ఏదో కదులుతున్నట్లు కొందరు గమనించారు. తీరా చూస్తే సుమారు 7 అడుగుల పొడవనున్న కొండచిలుల అటూ ఇటూ కదులుతోంది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో కలకలం రేగింది. బంధువులు అందరూ అటూ ఇటూ పరుగులు తీశారు.
స్థానికులు పట్టణ సీఐకి సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో ఆయన అక్కడికి వచ్చారు. అందరూ వచ్చి చూస్తుండడంతో అది ఎటూ కదలకుండా అలాగే ఉంది. సుమారు గంట తర్వాత కొండచిలువ గేటు పక్క నుంచి గోదావరి వైపు వెళ్లిపోయింది. అనంతరం మండపంలో ఓ వైపు చివరికి చేరి పెళ్లి తంతు పూర్తి గావించారు. అనంతరం అటవీశాఖ అధికారులు వచ్చి కొండచిలువను పట్టుకొని తీసుకువెళ్లారు.