Ramgopal Verma : రాంగోపాల్ వర్మకు నోటీసులు.. హైదరాబాద్ కు వెళ్లిన ఒంగోలు పోలీసులు

Ramgopal Verma : సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్ చేశారు. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు. వ్యక్తిగతంగా వాటిని అందజేసేందుకు ఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరింది. బుధవారం నోటీసులు అందజేసే అవకాశం ఉంది.

మరోవైపు రాంగోపాల్ వర్మపై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ రైతు విభాగం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.  దీంతో తుళ్లూరు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.

TAGS