Telangana CM:మ‌రి కాసేప‌ట్లో సీఎం పేరు ప్ర‌క‌ట‌న‌..రేవంత్ రెడ్డి సీఎం?

Telangana CM:తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజ‌యాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగ‌ర్ ని మించి అత్య‌ధిక స్థానాల‌ని సొంతం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయంగా మారింది. అయితే సీఎం అభ్య‌ర్థి విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతోంది. దీంతో ఏం జ‌ర‌గ‌బోతోంది?..కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎంగా నియ‌మించ‌బోతోంది? అన్న‌ది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సీఎం ప‌ద‌వి కోసం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు పోటీప‌డుతుండ‌టం, డిప్యూటీ సీఎం ప‌ద‌వుల కోసం కూడా నేత‌ల్లో పోటీనెల‌కొన‌డంతో తెలంగాణ సీఎం ఎంపిక విష‌యం పార్టీ వ‌ర్గాలు అధిష్టానానికి అప్ప‌గించాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన అనంత‌రం జ‌రిగే నాట‌కీయ ప‌రిణామాల‌ని చ‌క్క‌బెట్టేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రాల ప‌రిశీల‌కుడు డీకే శివ‌కుమార్ సీఎల్పీ మీటింగ్‌లో పాల్గొని స‌భ్యుల ఏక‌వాక్య తీర్మాణాన్ని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు అప్ప‌గించారు.

కీల‌క నేత‌ల‌తో పాటు ఢిల్లీ వెళ్లిన డీకె శివ‌కుమార్ ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో భేటీ అయి హైద‌రాబాద్‌కు తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. మ‌రి కాసేప‌ట్లో హైద‌రాబాద్ చేరుకోనున్నారు. సిటీకి చేరుకున్న వెంట‌నే తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. అనంత‌రం సీఎం పేరుని ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సీఎంగా ఖ‌రారు చేస్తూ ఏఐసీసీ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని డీకె శివ‌కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో వెల్ల‌డించిన త‌రువాత అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే సోమ‌వారం సీఎల్పీ స‌మావేశాన్ని నిర్వ‌హించిన అనంత‌రం ప‌రిశీల‌కుల బృందం స‌భ్యుల ఏక‌వాక్య తీర్మానాన్ని ఢిల్లీ పెద్ద‌ల‌కు అంద‌జేశారు. డీకె శివ‌కుమార్‌తో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్ద‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. మంగ‌ళ‌వారం రాత్రి డీకెతో క‌లిసి వారు కూడా హైద‌రాబాద్ చేరుకుంటున్నారు.

TAGS