Jagan : అధికారంలో ఉండగా చంద్రబాబు మీద ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన రాజధాని అమరావతిని నిర్ధాక్షిణ్యంగా పాడుబెట్టేశారు. విశాఖ రాజధాని పేరుతో చాలా హడావుడి చేసి రుషికొండ ను బోడిగుండులా చెక్కి రూ.500 కోట్లతో తన కోసం ప్యాలస్‌లు నిర్మించుకున్నారు జగన్. ప్రజలు నమ్మి అధికారం అప్పజెప్పితే పాలకులు ఈవిధంగా ప్రవర్తిస్తుంటే చూడలేక ఎన్నికల్లో గద్దె దించేశారు. అయితే ఈ కక్షపూరిత రాజకీయాలు ఏపీకి మాత్రమే కాదు తెలంగాణకు కూడా విస్తరించాయని బిఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. కేసీఆర్‌కి పేరు వస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టును పాడుబెట్టేసి.. ఎందుకూ పనికి రాదని దుష్ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ని అపఖ్యాతి పాలు చేసేందుకు రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరగరానిదేదో జరిగిపోయిందంటూ విచారణలు జరిపిస్తోందని ఆరోపిస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు కుంగిపోవడం, మరికొన్ని బ్యారేజీలు దెబ్బతినడం వంటివి కళ్లకు కనిపిస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ దానిలో నీళ్లు నింపకుండా దిగువకు విడిచిపెట్టేస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా జగన్లాగా కేసీఆర్‌పై అసూయతో నిర్ణయాలు తీసుకునే మాటైతే, హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు మొదలుపెట్టేవారే కాదు.. కానీ మెట్రోని నగరంలో మరింత విస్తరించేందుకు రూ.24,269 కోట్ల ఖర్చుతో కొత్తగా ఐదు కారిడర్లు నిర్మించేందుకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని రాజకీయంగా ఎంత విభేదిస్తున్నప్పటికీ ఆయనపై కక్షతో నగరానికి, రాష్ట్రానికి నష్టం కలిగించడం లేదు. ఆయన మొదలుపెట్టిన పనులను మరింత మెరుగుపరిచి కొనసాగిస్తున్నారు. ఇదివరకు హైదరాబాద్‌లో చంద్రబాబు ఐటి రంగాన్ని అభివృద్ధి చేయగా, ఆయనని తీవ్రంగా ద్వేషించే కేసీఆర్, కేటీఆర్‌లు ఆ ద్వేషాన్ని పక్కనపెట్టి ఐటి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. తత్ఫలితంగా గత పదేళ్లలో హైదరాబాద్ నగరం ఐటి రంగానికి కేంద్రంగా మారింది. కానీ ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణ పనులు కొనసాగిస్తే ఆయనకి పేరొస్తుందన్న అసూయతోనే దానిపై ‘కమ్మ ముద్ర’ వేసి పాడుబెట్టేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తర్వాత జగన్‌తో రాజకీయంగా ఎంతగా విభేదిస్తున్నప్పటికీ, జగన్ హయాంలో మొదలైన భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వంటి కొన్ని పనుల్లో వేగం పెంచారు. రాష్ట్రంలో ఇటువంటి విధానాలు పాటించే ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఏ పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాడు. ఈ విషయం పాలకులు అర్థం చేసుకున్నప్పుడు ఆ రాష్ట్రం, ఆ దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. లేకుంటే వారి రాజకీయాలకు, కక్షలకు ‘ప్లే గ్రౌండ్’లా మిగిలిపోతుంది.