Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి
పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదంపై పీఎం మోదీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పీఎం సహాయ నిధి నుంచి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని సహాయ ప్రాంతీయ రవాణా అధికారి (ఎన్ ఫోర్స్ మెంట్)ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.