Clyclone Michaung:బాప‌ట్ల‌లో తీరాన్ని తాకిన మిగ్‌జాం.. భారీగా ఈదురు గాలులు

Clyclone Michaung:తీవ్ర తుపాను మిగ్ జాం బాప‌ట్ల తీరాన్ని తాకింది. ఈ విష‌యాన్ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. మ‌రో గంట వ్య‌వ‌ధిలో పూర్తిగా తీరాన్ని దాట‌నుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. `మిగ్‌జాం` తీరం దాటిన త‌రువాత సాయంత్రానికి బ‌ల‌హీన‌ప‌డి వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంది. తుపాను తీరం దాటుతున్న నేప‌థ్యంలో బాప‌ట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలుల‌తో వ‌ర్షం కురుస్తోంది. స‌ముద్రంలో అల‌లు సుమారు 2 మీట‌ర్ల మేర ఎగిసి ప‌డుతున్నాయి.

తుపాను ప్ర‌భావంతో ఆంధ్ర ప్ర‌దేశ్‌ వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ప‌లు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వ‌ర్షాలు, ఈదురు గాలుల తీవ్ర‌త‌తో రైతుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగింది. నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు,ప‌ల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది. రాయ‌ల‌సీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్ర‌భావం క‌నిపించింది. వ‌రి, పొగాకు, ప‌సుపు, అర‌టి పంట‌లు దెబ్బ‌తిన్నాయి.

ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు నేల కూలాయి. ఇదిలా ఉంటే `మిగ్‌జాం` తుపాన్ చెన్నై న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఎక్క‌డ చూసినా రోడ్లు, కాల‌నీలు జ‌ల‌మ‌య‌మై క‌నిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇప్ప‌టికే చెన్నై విమానాశ్ర‌యం మొత్తం నీట మునిగిపోయింది. దీంతో ర‌న్ వే క‌నిపించ‌క‌పోవ‌డం, విమానాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌ల‌గ‌డంతో ప‌లు విమానాలని ర‌ద్దు చేశారు.

TAGS