Test series : ఆ నలుగురు స్వదేశంలో చివరి టెస్టు సిరీస్ ఆడినట్లేనా?
Test series : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో వరుసగా మూడో సారి ఫైనల్ చేరాలని భావించిన భారత్ క్లీన్ స్వీప్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రత్యర్థి జట్టుతో ఆడిన మూడు టెస్టుల్లో దారుణంగా ఓటమి చెందింది. ఇక ఈ సిరీస్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణమని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టీమిండియా ఈ ఒక్క సిరీస్ లోనే కాదు కొద్ది రోజులుగా టెస్టుల్లో వీరి ఆటతీరు పేలవంగా ఉంటున్నది. జట్టు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారనే పేరున్న ఈ టాప్ ప్లేయర్లు కాస్తా టీమ్ కు భారంగా మారుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
న్యూజిలాండ్‌తో సిరీస్ వైట్‌వాష్‌తో టీమిండియాలోని కొందరి ప్లేయర్ల టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనని తెలుస్తున్నది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల సిరీస్ తర్వాత ఆ ఆటగాళ్లపై వేటు తప్పదని తెలుస్తున్నది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, అశ్విన్‌లలో ఇద్దరికి బోర్డర్-గవాస్కర్ సిరీస్ చివరిదవుతుందని సమాచారం. ఆటగాళ్ల వయసు రీత్యా కొందరి భవిష్యత్‌పై బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ త్వరలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లే జట్టులో మార్పులు చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తున్నది. కానీ జట్టును ఇప్పటికే ప్రకటించడంతో మార్పులుచేర్పులకు అవకాశాల్లేవని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నవంబర్ 10న టీమిండియా ఆసీస్ టూర్ కు బయలుదేరనుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడంలో రోహిత్ సేన విఫలమైతే సూపర్ సీనియర్లపై వేటు తప్పదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల టూర్‌కు ఆ దేశం వెళ్లే టీమిండియాలో వారెవరూ ఉండకపోవచ్చని తెలుస్తన్నది. దాదాపు 12 ఏళ్లలో స్వదేశంలో టెస్ట్ సిరీస్ లలో భారత జట్టు సాధించిన విజయాల్లో విరాట్, అశ్విన్, జడేజా, రోహిత్‌ల పాత్ర అనిర్వచనీయం. వయస రీత్యా వారి ఆటతీరులో మార్పు కనిపిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నలుగురు క్రికెటర్లు స్వదేశంలో చివరి టెస్ట్ సిరీస్ ఆడేసినట్లేనని చర్చలు జరుగుతున్నాయి. ఇక 2011లో సీనియర్లు జట్టు నుంచి వైదొలిగినప్పడు ఏర్పడిన పరిస్థితులు పునరావృతం కావొద్దంటే .వయస్సు మీరిన ప్లేయర్ల భవిష్యత్‌కు సంబంధించి అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ వారితో సత్వరమే చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.