KCR:తుగ్లక్ రోడ్ నివాసంతో తెగిన కేసీఆర్ బంధం
KCR:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడంతో అధికార భారాసకు భంగపాటు తప్పలేదు. దీంతో తెలంగాణలో రెండు దఫాలుగా అధికారాన్ని చేపట్టిన భారాస మూడవ సారి చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపడుతున్న నేపథ్యంలో భారాసా నేతలు అధికార నివాసాలను వీడుతున్నారు. ఫలితాలు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ప్రగతి భవన్‌ను కూడా కాలీ చేసి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు.
ఇదే క్రమంలో మరో అధికారిక నివాసాన్ని కూడా కేసీఆర్ వీడారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న అధికారిక నివాసంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న 20 ఏళ్ల సుధీర్ఘ అనుబంధం తెగిపోయింది. 2004లో తెరాస తరుపున కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్‌లోని టైమ్ 8 క్వార్టర్‌ను కేటాయించారు.
2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచి మళ్లీ అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికై అదే క్వార్టర్‌లో ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికార నివాసాలను కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే కేంద్రం అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది.
అదే సమయంలో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత కూడా అదే నివాసాన్ని తన అధికారిక నివాసంగా ఎంచుకుంది. అలా తుగ్లక్ రోడ్‌లోని ఆ క్వార్టర్ కేసీఆర్‌కు, ఆయన కుమార్తె కవితకు అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కూడా ఆయన అదే నివాసాన్ని కొనసాగించారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో భారాస అధికారాన్ని కోల్పోవడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని అధికారిక నివాసాన్ని కాలీ చేస్తామని, తమకు రెడు మూడు రోజులు సమయం కావాలని భారాస వర్గాలు ఇప్పటికే అధికారులకు నివేదించినట్టుగా తెలిసింది.