Nitish Kumar Reddy : ప్రపంచంలో క్రికెట్ లో అత్యుత్తమ ఆల్ రౌండర్ కావడమే నా లక్ష్యం.. నితీశ్ కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy : టీం ఇండియా వచ్చే నెలలో బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లనుంది. అక్కడ అయిదు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇప్పటికే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించగా అందులో చాలా మంది యువకులకు అవకాశమిచ్చారు. ఆల్ రౌండర్ తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఈ సారి ఆస్ట్రేలియాలో ఆల్ రౌండర్ గా ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు.
కాగా నితీశ్ కుమార్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియా క్రికెట్ కు ఆడాలన్న నా కల నెరవేరింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆడేందుకు సెలెక్ట్ కావడం హ్యాపీగా ఉంది. అయితే ప్రపంచంలోనే తాను అత్యుత్తమ ఆల్ రౌండర్ కావాలనేది తన లక్ష్యమని నితీశ్ కుమార్ రెడ్డి అన్నాడు.
బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ లో నితీశ్ కుమార్ రెడ్డిని చాన్స్ రాగా.. రెండో టీ 20లో 72 పరుగులు చేశారు. కోచ్ గౌతం గంభీర్ సూచనతో ఆ మ్యాచ్ లో బాగా ఆడానని నితీశ్ పేర్కొన్నాడు. రివర్స్ స్వీప్ లు కాకుండా భారీ షాట్లకు ప్రయత్నించమని చెప్పగా అలాగే చేశానని దీంతో అక్కడ సక్సెస్ అయ్యానన్నాడు. ఆస్ట్రేలియాలో ఫ్యాట్ కమిన్స్ ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ముఖ్యంగా తాను బౌలింగ్ లో ఇంకా ఎంతో మెరుగుపడాలని దాని కోసం ఎక్కువగా శ్రద్ధ పెట్టానని పేర్కొన్నాడు.
ఇండియా ఏ మ్యాచ్ ల్లో ఆడి ఆస్ట్రేలియాలో పిచ్, వాటి పరిస్థితులు అన్నీ అర్థం చేసుకుని టెస్టుల్లో రాణించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు ముందు ఇండియా ఏ మ్యాచులు ఆడే జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు వీలైనన్నీ రోజులు మంచి ప్రాక్టీస్ దొరికితే అసలైన సిరీస్ లో రాణించే అవకాశం ఉంటుంది.