Congress:కాసేపట్లో సీఎల్పీ భేటీ.. నేడు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం?
Uttam Kumar Reddy
Congress:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో అధికార భారాసను పక్కన పెట్టిన తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. మ్యాజిక్ ఫిగర్‌కు మించి కాంగ్రెస్‌కు సీట్లని అందించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ పార్టీ నుంచి ముగ్గురు కీలక నేతలు సీఎం రేసులో ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క.
దీంతో కాంగ్రెస్ కీలక నేతలు రంగంలోకి దిగి సీఎల్పీ నేతను ఎన్నుకునేపనిలో పడ్డారు. ఇందు కోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ ఇప్పటికే రంగంలోకి దిగి విషయాన్ని చక్కబెడుతున్నారు. మరి కాసేపట్లో నగరంలోని ఓ హోటల్‌లో పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకోబోతున్నారు.
సీఎల్పీ నేత ఎంపిక అంతరం ఆ నివేదికను అధిష్టానానికి పంపనున్నారు. ఈ వ్యవహారాలన్నింటినీ డీకె శివకుమార్ దగ్గరుండి పర్యవేశించనున్నారు. నివేదిక ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఆ తరువాతే కాంగ్రెస్ బృందం గవర్నర్‌ను కలవనుంది. అంతా అనుకున్న విధంగా జరిగితే ఈ సాయంత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
సీఎంతో పాటు ఇదే రోజు ఇద్దరు డిప్యూట సీఎంల ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా తెలిసింది. ఇందు కోసం అక్కడ ఉన్న సౌకర్యాలపై కూడా కాంగ్రెస్ ఆరా తీసినట్టుగా తెలిసింది. ఇక్కడ దాదాపు 300 మంది పాల్గొనే విధంగా సౌకర్యాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలుసుకున్నాయి. ఇక మంత్రుల ప్రమాణ స్వీకారం ఈ నెల 6న కానీ లేదా 9న కానీ నిర్వహించే అవకాశం ఉందని, దీన్నే విజయేత్సవ సభగానూ నిర్వహించాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయని సమాచారం.