BRS : ప్రతిష్టను పెంచుకుంటున్న బీఆర్ఎస్.. దిగజార్చుకుంటున్న వైసీపీ
BRS and YCP : గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరగడంతో అటు ప్రజలు.. గతంలో పాలించిన వాళ్లకు ఇప్పటి ప్రతిపక్షాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తూ తమ భవిష్యత్ కార్యాచరణకు పునాది రాళ్లను పరుచుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాల అమలుతో అక్కడ కొన్ని ప్రాంతాల ప్రజలు అధికార పార్టీపై కాస్త విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్షం బీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారు. ఇందులో ముఖ్యంగా హైడ్రా బాధితులే బీఆర్ఎస్ వంతకు చేరుతున్నారు. ప్రభుత్వం తమ కళ్ల ముందే తమ జీవితకాల కష్టాన్ని బుల్డోజర్లతో కూలుస్తుంటే చూసి తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోయిన కుటుంబాల గాధలు వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. ఇక గ్రూప్ 1 పరీక్షల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన అభ్యర్థులకు రేవంత్ సర్కార్ లాఠీ దెబ్బలను బహుమతిగా ఇచ్చిందంటూ బాధిత కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఇలా ప్రజల్లో పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ఈ ప్రభుత్వ నిర్ణయాలను తమ బలంగా మార్చుకుని తదుపరి ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేత కేటీఆర్.
బీఆర్ఎస్ ఓటమి తర్వాత కొంతకాలం కుదుటపడడానికి ప్రభుత్వానికి సమయం ఇచ్చింది, ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే వరకు వేచి చూసి ఆ సమయం వచ్చిన తర్వాత తన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పార్టీ గొంతు వినిపించడానికి ప్రజా మద్దతు ఉన్నప్పటికీ కేసీఆర్ ఇంకా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వేసే తప్పటడుగుల కోసం కాసుకుని కూర్చున్నారు. అయితే తెలంగాణలో ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇలా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తుంటే ఏపీలో విపక్షమైన వైసీపీ మాత్రం తన తలాతిక్క లేని పనులు చేస్తూ పోతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు మొదలు పెట్టింది వైసీపీ. గత ప్రభుత్వ వైఫల్యాల వలన కాదు ఈవీఎం ల సెట్టింగ్ ఫలితంగానే వైసీపీ కి ఈ స్థాయి అపజయం వచ్చిందని కూటమి పార్టీలకు ఆ స్థాయి విజయం దక్కిందంటూ ప్రజా తీర్పుని వ్యతిరేకిస్తూ తనను, తన పార్టీని తానే ప్రజల్లో పలుచన చేసుకుంటున్నారు వైస్ జగన్. దానికి తోడు గత ఐదేళ్ల తన అధికారంలో ప్రజా సమస్యల మీద స్పందించడానికి ప్యాలెస్ దాటని జగన్ ఇప్పుడు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా దర్బార్, జనవాణిల పేరిట కూటమి నేతలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలను చూసి కూడా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి షూటింగ్ లు చేసుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. గత నెలలో ఏపీలో వరదలు సృష్టించిన జలప్రళయానికి అటు ప్రభుత్వం.. ఇటు దాతలు ముందుకు వచ్చి ఏపీ ప్రజలకు అండగా నిలిస్తే ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి, విపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటన రూపంలో బాధితులకు అందించి ప్రజలు ఛీత్కారాన్నిచూసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు తాజాగా జగన్ తండ్రి ఆస్తి కోసం తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల మీద కోర్ట్ కెళ్లడం వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిగణించవచ్చు.
జగన్ నోరు తెరిస్తే ‘విలువలు…విశ్వసనీయత’ అంటూ చెప్పే కబుర్లకు ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేశారు. బిఆర్ఎస్ కి ప్రజలతో, ప్రత్యర్థులతో ఎప్పుడు రాజకీయాలు చెయ్యాలో ఎప్పుడు రాజీ పడాలో అనేదానికి ఒక ‘లెక్క’ ఉంది కానీ, వైసీపీ విషయానికి వస్తే ఏ సమయంలో ఏం చెయ్యకూడదో, ఎప్పుడు ఎవరిని రెచ్చకొట్టకూడదో అదే ‘తిక్క’ పనులు చేసి చివరికి మూల్యం చెల్లించుకుంది.