Steel plant employees : వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు.. కారణం ఇదేనా?
Steel plant employees : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ఉద్యోగులు పని చేసేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, ముడిసరుకుల కొనుగోలుకు నిధుల కొరత, కేంద్ర సాయం చేసేందుకు ముందుకు వస్తున్నా.. పెడుతున్న కండీషన్స్ వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)ను ఎంచుకొని సంస్థను వీడడమే మంచిదని పలువురు ఉద్యోగులు అనుకుంటున్నారు. కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని, 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు వీఆర్ఎస్ కు అర్హులని యాజమాన్యం రెండు రోజుల క్రితం ప్రకటించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మొదటి రోజు 500 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ కు అంగీకరించగా, రెండో రోజు 1,200 మంది ఫాలో అయ్యారు. విరమణకు కేవలం మూడేళ్లు మాత్రమే ఉన్న వారికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని కార్మిక సంఘాలు సూచించడంతో ఈ గ్రూపులోని పలువురు వీఆర్ఎస్ పోర్టల్ లో నమోదు చేసుకుంటున్నారు.
1,497 మంది ఎగ్జిక్యూటివ్ లు, 1,003 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు వీఆర్ఎస్ పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం ఎగ్జిక్యూటివ్ లకు రూ. 918.92 కోట్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ లకు రూ. 340.19 కోట్లు కాగా, మొత్తం బడ్జెట్ రూ. 1,260 కోట్లకు చేరింది. ఈ ఏడాది చివరి నాటికి వీఆర్ఎస్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, సుమారు 2,500 మంది ఉద్యోగులు సంస్థను వీడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.