Hijra worship : గోదావరి నదిలో హిజ్రాల పూజలు.. ఎందుకో తెలుసా ?
Hijra worship in Godavari River : సాధారణంగా హిజ్రాలను చూడగానే పక్కకు జరుగుతాం. వాళ్లంటే సమాజంలో చిన్న చూపు చాలా మందికి. కానీ వాళ్లు సమాజంలోని ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారు. వారిని దూరం పెట్టినా జనం కోసం వారు పూజలు చేస్తూ తమలో మానవత్వాన్ని చాటి చెబుతుంటారు. ప్రజల యోగక్షేమాల కోసం జాగారాలు, పూజలు చేస్తున్నారు. ఇంతకు వారు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో ప్రతేడాది సంభవించే అకాల వర్షాలు వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి. భద్రాచల పట్టణంలో సైతం వరదనీరు వచ్చి పట్టణవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. దక్షిణ అయోధ్యగా పేర్గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దైవదర్శనానికి వచ్చే భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
ఇలా ప్రతేడాది వస్తున్న వరదలకు శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతం భద్రాద్రి పట్టణంలో రక్షణ వలయంగా ఉన్న గోదావరి కరకట్టను మరింత పటిష్టపరిచి కరకట్టను మరికొంత దూరం పొడిగించాలని ప్రతిపాదనలు చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరి కరకట్టను మరింత పటిష్టపరిచి వరదల నుంచి భద్రాద్రి వాసులను రక్షించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన పలువురు హిజ్రాలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు ఉపవాస దీక్ష, రాత్రంతా జాగారం చేశారు. మంగళ వాయిద్యాలతో భద్రాచల పట్టణంలోని గోదావరి తీరానికి ప్రదర్శనగా వెళ్లారు. ఓ హిజ్రాను మాతంగులగా చేసి ఆకుపచ్చని వస్త్రాలను ధరించి వెండి పాల బిందెతో పాలు తీసుకుని వెళ్లి గోదావరిలో పోసి ప్రార్థనలు నిర్వహించారు.