ED searches : సిద్ధరామయ్యపై కేసు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
ED searches : మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మైసూర్ లోని ముడా కార్యాలయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల దాడులు చేపట్టారు. 12 మంది అధికారుల బృందం శుక్రవారం ఉదయం ముడా కార్యాలయంలో సోదాలు చేసింది. దీంతోపాటు మైసూరులోని ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ముడా చీఫ్ గా కే మరిగౌడ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈడీ దాడులు చేపట్టింది. అయితే ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అధికారులందరినీ ఏజెన్సీ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్ సహా సీనియర్ అధికారులు, ప్రత్యేక భూసేకరణ కార్యాలయానికి చెందిన సిబ్బందితో ఈడీ అధికారులు సమావేశమయ్యారు. భూ కేటాయింపు కేసులో ముడా అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.