Jewelery bag : బస్సులో మహిళకు దొరికిన ఆభరణాల బ్యాగ్.. తిరిగి బాధిత మహిళకు అప్పగింత
Jewelery bag : బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు బంగారు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగ్ దొరికింది. దీంతో ఆ మహిళ పోలీసులకు అప్పగించగా వారు బాధిత మహిళకు ఆ బ్యాగ్ ను అందజేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఇర్లపాడుకు చెందిన యానాదమ్మ అనే మహిళ హైదరాబాద్ నుంచి మర్రిపాడుకు ఓ ట్రావెల్ బస్సులో ప్రయాణించారు. అదే బస్సులో ప్రయాణించిన శైలజ అనే ప్రయాణికురాలు తన బ్యాగును మరిచిపోయి బస్సు దిగి వెళ్లిపోయారు. అనంతరం ఆ బ్యాగును గమనించిన యానాదమ్మకు అందులో బంగారం, వెండి ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి ఆమె పోలీసులకు అప్పగించింది.
మర్చిపోయిన బ్యాగులో మహిళ వివరాలు ఉండడంతో వెంటనే ఆమెకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే నంద్యాల నుంచి నెల్లూరు జిల్లా మర్రిపాడు రాగా, పోలీసుల సమక్షంలో ఆభరణాలున్న బ్యాగును అప్పగించారు. ఆ బ్యాగులో 9 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. బ్యాగు దొరికిన వెంటనే పోలీసులకు ఇచ్చిన యానాదమ్మను మర్రిపాడు పోలీసులు అభినందించారు. తన బ్యాగును జాగ్రత్తగా అప్పగించినందుకు యానాదమ్మకు శైలజ ధన్యవాదాలు తెలిపారు.