Musi Houses : ప్రభుత్వానికి షాక్.. హైకోర్టు స్టే తెచ్చుకున్న మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు
Musi Houses : ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. తమ ఇళ్లు కూల్చి వేయొద్దని హైకోర్టు నుంచి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ ఇంటి వద్ద చూసిన కోర్టు స్టే లే దర్శనమిస్తున్నాయి. దాదాపు 100 ఇళ్ల యజమానులు స్టే తెచ్చుకున్నట్లు సమాచారం. మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లు ఇవ్వమని యజమానులు స్పష్టం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమని వారు చెప్తున్నారు.
మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్ లోని ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిశోర్ ఇటీవల తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామన్నారు.