North Korea : దక్షిణ కొరియాతో సరిహద్దును మూసివేస్తాం..: ఉత్తర కొరియా
North Korea : దక్షిణ కొరియాతో తమ సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ఉత్తరకొరియా బుధవారం ప్రకటించింది. ఆ దేశంతో పాటు అమెరికాతో తలెత్తుతున్న ఉద్రిక్తతలను నిలువరించేందుకు సరిహద్దు వెంబడి రక్షణపరమైన నిర్మాణాల చేపడతామని వెల్లడించింది. అక్టోబరు 9న (బుధవారం) తొలుత ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఉత్తర కొరియా పీపుల్స్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్టు ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చిందని పేర్కొంది.
అయితే కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఎటువంటి ప్రయాణాలు, రవాణా లేని నేపథ్యంలో తాజా నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నగా మారింది. ఈ పరిణామాలపై దక్షిణకొరియా సైన్యం స్పందించింది. సరిహద్దుల్లో ప్రస్తుతమున్న పరిస్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పింది.