Animal Movie Review:`యానిమల్` మూవీ రివ్యూ
Animal Movie:నటీనటులు: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, పృథ్వీ, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఓబెరాయ్, రవిగుప్తా, సిద్ధార్ధ్ కర్ణిక్, సౌరభ్ సచ్‌దేవ్, మాగంటి శ్రీనాథ్, రాఘవ్ బినానీ, గగన్ దీప్ సింగ్, ఉపేంద్ర లిమాయే, మాథ్యూ వర్గీస్, ఇందిరా కృష్ణన్, సలోనీ బాత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఎడిటింగ్:సందీప్ రెడ్డి వంగ
సినిమాటోగ్రఫీ:అమిత్ రాయ్
మ్యూజిక్ (సాంగ్స్) :జామ్ 8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, ఆషిమ్ కెమ్సన్, హర్షవర్థన్ రామేశ్వర్ (అర్జున్ రెడ్డి` ఫేమ్)
నేపథ్య సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్ (అర్జున్ రెడ్డి` ఫేమ్)
నిర్మాతలు:భూషణ్ కుమార్, కృష్ణకుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ.
రెగ్యులర్‌గా సినిమా అంటే ఇలానే తీయాలి?.. ఇవే లెక్కలు, బౌండరీస్ పెట్టుకుని ఆ చట్రంలోనే తీయాలి.. అంటూ తెలుగు సినిమాకు కొన్ని లెక్కలు, బౌండరీస్ ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి మూస థోరణికి భిన్నంగా తనదైన మార్కు టేకింగ్, మేకింగ్‌తో `అర్జున్‌రెడ్డి`ని తెరకెక్కించి ఇండస్ట్రీతో పాటు సగటు సినీ లవర్‌ని షాక్‌కు గురి చేశాడు సందీప్ రెడ్డి వంగా. పాథ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్‌తో ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకుల్ని షేక్ చేసిన సందీప్ మళ్లీ `యానిమల్`తో అదే మ్యాజిక్ చేశాడా? ..రణ్ బీర్ కపూర్ హీరోగా హిందీలో రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో ఈ శుక్రవారం రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్‌లతో సంచలనం సృష్టించడమే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో హాట్ టాపిక్‌గా మారిన `యానిమల్` అంచనాల్ని అందుకుందా? ..మరో సారి సందీప్ రెడ్డి వంగ `అర్జున్‌రెడ్డి` మ్యాజిక్‌ని రిపీట్ చేశాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటీ?:
బల్బీర్ సింగ్ (అనీల్ కపూర్) దేశంలోనే అత్యంత సంపన్నుడు. నిత్యం బిజినెస్ పనుల్లో బిజీ బిజీగా గడిపేస్తుంటాడు. రణ్ విజయ్ సింగ్ (రణ్‌బీర్ కపూర్) ఆయన కుమారుడు. తండ్రి అంటే రణ్ విజయ్‌కి పిచ్చి ప్రేమ. అతనో సూపర్ హీరో. కానీ తండ్రి మాత్రం రణ్ విజయ్‌కి పెద్దగా టైమ్ కేటాయించడు. రణ్ విజయ్ చాలా వైలెంట్. తన కాలేజీ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారని ఆగ్రహించి వైల్డ్‌గా ప్రవర్తిస్తాడు. మెషిన్ గన్ తీసుకెళ్లి మరీ వారిని బెరించి షాక్ ఇస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి బల్బీర్ సింగ్ అతన్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చాక జరిగిన ఓ గొడవ తండ్రీ కొడుకుల మధ్య దూరం పెంచుతుంది. దీంతో రణ్ విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రిపై హత్యా యత్నం జరిగిందని తెలిసి తిరిగి ఎనిమిదేళ్ల తరువాత ఇండియా తిరిగొస్తాడు.
తనని ద్వేషించే తండ్రి కోసం రణ్ విజయ్ ఎంత వరకు వెళ్లాడు?..ఇంతకీ బల్బీర్ సింగ్ పై హత్యా యత్నానికి పాల్పడిన వారు ఎవరు?..వారి తలలని తెగ నరుకుతానని, తన తండ్రి కోసం ఎంత వరకైనా వెళతానని శపథం చేసిన రణ్ విజయ్ తన తండ్రి కోసం ఎలాంటి మారహోమాన్ని సృష్టించాడు? ..గీతాంజలి (రష్మిక మందన్న)కు రణ్ విజయ్‌కు మధ్య సాగిన ప్రేమ కథేంటీ? ..రణ్ విజయ్ యాంగర్ మేనేజ్‌మెంట్ కారణంగా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?..అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు?. అతనికి రణ్ విజయ్‌కున్న వైరం ఏంటీ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ సినిమా విషయంలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రణ్ బీర్ కపూర్. ఒక్క మాటలో చెప్పాలంటే `యానిమల్` వన్ మ్యాన్ షో. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో నటుడిగా ప్రత్యేకతను చాటుకున్న రణ్ బీర్ కపూర్ `యానిమల్`లో తనదైన మార్కు నటనతో అదరహో అనిపించాడు. సంజయ్ దత్ బయోపిక్‌లో ఆయననే మరిపించేలా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రణ్ బీర్ కపూర్ `యానిమల్`లోని రణ్ విజయ్ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పొచ్చు. `అర్జున్ రెడ్డి`లో విజయ్ దేవరకొండకు లైఫ్ టైమ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టుగానే రణ్ బీర్‌కు `యానిమల్` లోనూ అదే తరహా క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆ పాత్రని అంతే ఇంటెన్స్‌తో పోషించి రణ్ బీర్ షాక్ ఇచ్చాడు.
టైటిల్‌కు తగ్గట్టే కీలక సన్నివేశాల్లో రణ్ బీర్ కనబరిచిన నటనకు థియేటర్లలో ప్రేక్షకుల విజిల్స్‌తో మారుమ్రోగుతున్నాయి. ముఖ్యంగా కాలేజ్‌లో స్టూడెంట్స్‌ని బెదిరించే సీన్, తండ్రితో నేను ఫాదర్, మీరు కొడుకు అంటూ చెప్పే సన్నివేశం. ప్రీ ఇంట్ర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీన్‌లలో రణ్ బీర్ అదరహో అనిపించాడు. ఒక విధంగా చెప్పాలంటే తన కోసమే సందీప్ రాసిన పర్ ఫెక్ట్ క్యారెక్టర్ అనిపించేలా చేశాడు. ఇక హీరోయిన్ గా రష్మిక మందన్న తన పాత్ర పరిధి మేరకు నటించింది. మిగతా పాత్రల్లో తండ్రిగా అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, పృథ్వీ, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఓబెరాయ్, రవిగుప్తా, సిద్ధార్ధ్ కర్ణిక్, సౌరభ్ సచ్‌దేవ్, మాగంటి శ్రీనాథ్, రాఘవ్ బినానీ, గగన్ దీప్ సింగ్, ఉపేంద్ర లిమాయే, మాథ్యూ వర్గీస్, ఇందిరా కృష్ణన్, సలోనీ బాత్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించి అలరించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
టి సిరీస్ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు తగ్గట్టుగా భారీ తనాన్ని తెచ్చి పెట్టాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తండ్రి, కొడుకుల ఎమోషనల్ డ్రామాగా సినిమాని మలిచిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. కథనం కొంత లాగ్ అయింది. సందీప్ రెడ్డి వంగానే దీనికి ఎడిటర్ కావడంతో లెంత్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మరింత సహజంగా సాగుతున్న ఫీల్‌ని కలిగించింది.
ఈ సినిమాకు జామ్ 8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, ఆషిమ్ కెమ్సన్, హర్షవర్థన్ రామేశ్వర్ (అర్జున్ రెడ్డి` ఫేమ్) వంటి ఏడుగురు సంగీత దర్శకులు పని చేశారు. వీరు అందించిన పాటలు బాగున్నాయి. అందులో కొన్ని హంట్ చేసే విధంగా ఉన్నాయి. ఇక `అర్జున్ రెడ్డి`కి మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు కూడా అదే స్థాయి నేపథ్య సంగీతం అందించారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని భారీ హంగులతో నిర్మించారు.
ఎలా ఉందంటే?:
తండ్రి ప్రేమ కోసంవ తపించే యువకుడి కథ నేపథ్యంలో ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు చాలా కథలే వచ్చినా `యానిమల్` మాత్రం చాలా డిఫరెంట్. తండ్రిని ఓ సూపర్ హీరోగా భావించే తనయుడు ఆ తండ్రి ప్రేమను పొందడం కోసం తనతో తానే యుద్ధం చేసే మానసిక సంఘర్షణ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ `యానిమల్`ని రూపొందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. యూనివర్సల్ పాయింట్‌తో సున్నితమైన భావోద్వేగాల సహారంగా ఈ సినిమాని మలిచిన తీరు వా అనిపిస్తుంది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ టాలెంట్, మేకింగ్ విషయంలో ఆయనకున్న క్లారిటీ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తోంది.
ఈ సినిమాలోని ప్రతీ సన్ని వేశం ప్రేక్షకుడికి నెక్స్ట్ లెవెల్ ఫీల్ ని కలిగిస్తుంది. రణ్ బీర్ క్యారెక్టర్‌కు ఇచ్చిన ఎలివేషన్స్, వైల్డ్ సీన్స్ మాస్‌తో పాటు మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని కూడా కట్టి పడేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, తండ్రీ కొడుకులు పాత్రలు ఛేంజ్ చేసుకునే సీన్, రష్మిక, రణ్ బీర్ మధ్య వచ్చే సన్నివేశాలు, బాబీ డియోల్ సిగరెట్ కాల్చే సీన్.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలే ఆహా అనిపించే సీన్స్ చాలానే ఉన్నాయి. అయితే మూడు గంటల 21 నిమిషాలు కాకుండా నిడివి కొంత కుదిస్తే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పాలంటే యానిమల్ కంప్లీట్‌గా సందీప్ వంగ ఎక్సలెంట్ మేకింగ్‌తో కూడుకున్న రణ్‌బీర్ కపూర్ వన్ మ్యాన్ షో
పంచ్ లైన్: రణ్‌బీర్ కపూర్ వన్ మ్యాన్ షో
రేటింగ్: 3.5