Haryana : హర్యానాలో అంచనాలు ఎలా తప్పాయి..? బీజేపీ హ్యాట్రిక్ కు కారణాలేంటి?

Haryana

Haryana

Haryana : అక్టోబర్ 5 సాయంత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత, కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతున్నదని ప్రకటించని ఎగ్జిట్ పోల్ ఏదీ లేదు. అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎగ్జిట్ పోల్స్ భ్రమ అనేది తేలిపోయింది. మొదటి రౌండ్ లెక్కింపు సమయంలో కాంగ్రెస్ భారీ మెజారిటీ వైపు వెళుతున్నట్లు కనిపించినా అది కొద్ది సేపటికే లెక్కలు తారుమారయ్యాయి. ఉదయం10 గంటలకు అంచనాలు మారాయి. హర్యానాలో బీజేపీ మూడోసారి విజయం దిశగా అడుగులు వేసింది.

జాట్ కమ్యూనిటీ ముక్కుసూటితనం

హర్యానా సామాజిక స్థితిగతులు, అక్కడి ప్రజల స్వభావం లోతుగా తెలిసిన వారికి ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మీడియాలో చూపించినంతగా లేవని తెలుసు. హర్యానాలో  కుల గణన ప్రకారం చూసుకుంటే  జాట్‌లు 23 శాతంతో ఫలితాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఇక్కడి జాట్ కమ్యూనిటీ ప్రత్యేకత ముక్కుసూటితనం. అది ఈ ఫలితాలతో మరోసారి స్పష్టమైంది.  రైతులు, రెజ్లర్ల ఉద్యమంలో కూడా జాట్లు కీలకంగా వ్యవహరించారు. హర్యానా మొత్తతం బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినట్లు అనిపించింది.

హర్యానాలో ఓబీసీ, దళితుల ఓట్ల విషయంలో మరో వాస్తవం కూడా దాగి  ఉంది . అక్కడ దాదాపు 35 శాతం ఓబీసీ ఓటర్లు ఉన్నారు. దీనితో పాటు, దాదాపు 21% దళితులు, మిగిలిన వారు బ్రాహ్మణులు, వైశ్యులు, పంజాబీ, గుర్జార్, యాదవులు. జాట్ సామాజిక వర్గం  ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నది. వారికి పెద్ద మొత్తంలో సాగు భూములు ఉండడంతో రైతుల ఉద్యమంలో వారి భాగస్వామ్యం ఎక్కువగా కనిపించింది. అందుకే ఈ ఉద్యమానికి కాంగ్రెస్ అండగా నిలిచింది. కాంగ్రెస్ తన రాజకీయాలన్నింటినీ జాట్‌ కేంద్రంగా మార్చుకున్నది. జాట్‌లు, దళితులు కలిసి తనను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని కాంగ్రెస్  నమ్ముకుంది. కాంగ్రెస్ అత్యధికంగా 28 మంది జాట్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలపగా, బీజేపీ 16 మందిని మాత్రమే ఈ సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలో నిలిపింది.

దళితుల అసంతృప్తి

హర్యానాలో కాంగ్రెస్‌ అధికారాన్ని భూపేందర్‌ సింగ్‌ హూడా కైవసం చేసుకున్నారు. దళిత నేత కుమారి సెల్జా విజయం సాధించలేదు. కాంగ్రెస్‌పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరడంతో, జాట్లు కూడా తాము మోసపోయామనే భావనలోకి వెళ్లిపోయింది.

సోషల్ ఇంజినీరింగ్ ప్రభావం

2014లో విజయం తర్వాత, రాష్ట్రంలోని శక్తివంతమైన కులాలు,  వర్గాలను లెక్కలోకి తీసుకోకుండా బీజేపీ అనూహ్యంగా పంజాబీ మనోహర్ లాల్‌కు అధికార పగ్గాలు అప్పగించింది. ఇది జాట్ సమాజంలోని పెద్దల్లో ఆగ్రహాన్ని పెంచింది.

ఫలించిన సైనీ ఎత్తుగడ  

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఈ విషయాన్ని పసిగట్టింది.  మనోహర్ లాల్ స్థానంలో వెనుకబడిన తరగతికి చెందిన నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. రాష్ట్రంలోని 35% ఓబీసీ ఓటర్లలో అధిక భాగం బీజేపీకి మద్దతున రావడం ఈ సోషల్ ఇంజినీరింగ్ ప్రభావం అని చెప్పవచ్చు.

ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, బీజేపీకి 39.93% ఓట్లు రాగా, కాంగ్రెస్‌ కు 39.26% ఓట్లు వచ్చాయి . ఏ పార్టీకి ఏ సామాజికవర్గం ఓట్లు పడ్డాయనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయవచ్చు. స్థూలంగా చూస్తే, యాదవులు, గుజ్జర్లు సహ  ఓబీసీ సామాజికవర్గంలోని ఇతర ఓటర్లతో పాటు సంప్రదాయ పంజాబీ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల ఓట్లన్నీ దాదాపు బీజేపీకి పడినట్లు తెలుస్తున్నది. దీంతో కాషాయదళం మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది.

రైతులు, రెజ్లర్ల ఉద్యమాలు  

వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో బీజేపీపై వ్యతిరేకత రావడం సహజం. ఇక్కడ  రైతు ఉద్యమాలు, రెజ్లర్ల ఉద్యమాలు మరింత ప్రభావం చూపాయి.

కీలకంగా వ్యవహరించిన సంఘ్

హర్యానాలో తాము మూడోసారి అధికారంలోకి రావడం అంత సులువు కాదని బీజేపీ గుర్తించింది. దీంతో సంఘ్ కార్యకర్తలను పెద్ద మొత్తంలో క్షేత్రస్థాయిలోకి పంపింది. దశాబ్ద కాలంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో భారీ ర్యాలీలు, సభల నిర్వహణకు మొగ్గు చూపుతున్నది. కానీ హర్యానాలో మాత్రం భారీ సభలకు   బదులు పంచాయతీలు, క్షేత్ర స్థాయిలో ఓటర్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేసింది బీజేపీ. ఇక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు విజయం సాధించారనే చెప్పవచ్చు. తాము బలహీనంగా ఉన్నామని భావించిన ప్రాంతాల్లో  సంఘ్ కార్యకర్తలు ఓటర్లకు బీజేపీ ఆవశ్యకతను వివరించి వారిని పోలింగ్ బూత్ ల వైపు వెళ్లడంతో కీలకంగా వ్యవహరించారు.

అర్బన్ ఏరియాల్లో  బీజేపీదే హవా 

హర్యానాలోని అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఏకపక్షంగా గెలుపొందడం మరో విశేషం. రాష్ట్రంలోని 12 అర్బన్ స్థానాల్లో పది స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీజేపీలో కొంత నిరాశ నెలకొంది. హర్యానాలో జరిగిన ప్రచారంలో కూడా కొంతమేరకు ఈ నిరాశే కనిపించింది.అయితే కింది స్థాయిలో పనులు జరుగుతున్న తీరు, పంచాయతీ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసేందుకు చేసిన ప్రయత్నాలు చాలా ప్రభావం చూపాయి.

ఎస్‌పీ దూరంగా ఉన్నా..

హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని నిర్ధారించడానికి పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. ఎస్‌పీ కూడా జాతీయ పార్టీగా అవతరించాలని కోరుకుంటుంది. సహజంగానే హర్యానా ఓటమి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి అంతర్గత రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది.

TAGS