Salaar Trailer:`సలార్` ట్రైలర్ మేనియా.. ప్రభాస్ కోసమే అలా రిలీజ్ చేస్తున్నారా?
Salaar Trailer:బాహుబలి, కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్, పుష్ప వంటి సినిమాల తరువాత దక్షిణాది సినిమా అంటే దేశ వ్యాప్తంగా అటెన్షన్ మొదలవుతోంది. ఎలాంటి సినిమాతో దక్షిణాది మేకర్స్ రాబోతున్నారో అని ఉత్తరాది ప్రేక్షకులు, బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `సలార్`. `కేజీఎఫ్` వంటి సంచలన బ్లాక్ బస్టర్‌ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై రెండు భాగాలుగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, టినూ ఆనంద్, శ్రియారెడ్డి, ,రామచంద్రరాజు (కేజీఎఫ్ గరుడ) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని అభిమానులు, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న `సలార్`ని భారీ స్థాయిలో మేకర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ కావడంతో `డైనోసార్` ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అనే చర్చ అభిమానుల్లో కొన్ని రోజులుగా జరుగుతోంది. ఎట్టకేలకు మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ని ఫిక్స్ చేయడంలో అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన `సలార్` ట్రైలర్‌ని డిసెంబర్ 1న శుక్రవారం రాత్రి 7:19గంటలకు రిలీజ్ చేస్తున్నారు. టీజర్‌తో అంచనాలు పెంచేసిన మేకర్స్ ట్రైలర్‌తో మెస్మరైజ్ చేయబోతున్నారట. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన `సలార్`కు ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్‌పై రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ట్రైలర్ రిలీజ్ కోసం యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ `సలార్` టీమ్ షాక్ ఇచ్చింది. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇప్పటికే సంచనలం సృష్టిస్తూ యూట్యూబ్‌లో టీజర్ రికార్డులు తిరగరాస్తున్న వేళ ట్రైలర్‌ని భారీ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా `సలార్` టీమ్ ఎలాంటి ఈవెంట్ లేకుండా హోంబలే ఫిలింస్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో సింపుల్‌గా రిలీజ్ చేస్తోంది. ఇదే ప్రభాస్ అభిమానుల్ని కొంత నిరాశకు గురి చేస్తోంది.
ఇంత భారీ సినిమా ట్రైలర్‌ని ఎలాంటి హడావిడీ లేకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ప్రభాస్ అని తెలిసింది. గత కొంత కాలంగా మోకాలి చికిత్స కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మోకాలి సర్జరీ పూర్తి కావడంతో హీరో ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఈవెంట్లో పాల్గొనలేరని భావించిన టీమ్ `సలార్` ట్రైలర్‌ని ఎలాంటి హంగామా లేకుండా సింపుల్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. టీజర్‌తో సంచలనాలు సృష్టిస్తున్న`సలార్` ట్రైలర్‌తో డిసెంబర్‌ని హీటెక్కించడం ఇక లాంఛనమే అని అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టి సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.