BRS Leaders : పార్టీ కండువాలు కప్పుకుని ఓటు వేసిన నాయకులు
BRS Leaders : అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఇద్దరు అభ్యర్థులు గురువారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో పార్టీ కండువాలు ధరించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు.
న్యాయ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని ఎల్లపెల్లి గ్రామంలో పార్టీ కండువా కప్పుకొని పోలింగ్ బూత్ కు వచ్చి తన ఓటును వేశారు. ఆయన ధరించిన పార్టీ కండువా పై పార్టీ పేరు, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చిత్రపటం ఉన్నాయి.
మరో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేసే సమయంలో పార్టీ కండువా కప్పుకొని వచ్చారు. వెంకటాపూర్ గ్రామంలోని పోలింగ్ బూత్ లో చిన్నయ్య కండువా కప్పుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది.