corporate office : చూస్తానికి పైకి మాత్రమే సూపర్.. కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగం నరకం
corporate office like Hell : కార్పొరేట్ కంపెనీల్లో పని ఒత్తిడితో యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల పూణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ కార్యాలయంలో చోటుచేసుకుంది. వ్యక్తిగత విరామాలు కూడా లేకుండా అదే ఒత్తిడితో కూడిన పని కారణంగా ఉద్యోగుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. యంగ్ ప్రొఫెషనల్స్ పట్ల మానవత్వంతో మెలగాలని, వారి శ్రేయస్సుపై మరింత దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నా కంపెనీలు అవేవీ పట్టించుకున్న పాపాన పోలేదు. తమ కంపెనీకి ఎంత వరకు అవసరం అవుతారో అంతవరకు పిండుకోవడమే పనిగా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నాయి. ఇలా పని ఒత్తిడి కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలను కూడా వదిలిపోతున్నారు. ఇలాంటి విషపూరితమైన పని వాతావరణంలో పనిచేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
కార్పొరేట్ కంపెనీలు తమ హెచ్ఆర్ విధానాలను మార్చుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా కొత్తగా చేరే ఉద్యోగుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. యువ ఉద్యోగుల మద్దతు కోసం కార్యాలయ వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవాలన్నారు. కార్పొరేట్ సంస్కృతిలో ఉద్యోగుల సంక్షేమంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దేశంలోని అనేక కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల్లో ప్రొఫెషనల్స్ చేరుతున్నారు. కానీ ప్రారంభంలో సరైన ప్రోత్సాహం , మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల వారు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. మానసికంగా కూడా బాధపడుతున్నారు. అలాంటి వారికి సహాయం చేయడానికి కార్పొరేట్ హెచ్ఆర్ విధానాలను మార్చాలని చాలా మంది కోరుకుంటారు.