Pawan Kalyan : టీటీడీ లడ్డు వివాదం పై పవన్ సంచలన కామెంట్స్  

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : తిరుపతి లడ్డూ వివాదం రోజురోజుకు వేడెక్కుతోంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారని, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు స్వామివారి విషయంలో జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తాజాగా సుప్రీంకోర్టు కామెంట్స్ తో వైసీపీ నుంచి వస్తున్న అనుమానాలు బలపడుతున్నాయి.  అనూహ్యంగా సుప్రీంకోర్టు దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యింది. చంద్రబాబు చర్యలను తప్పు పట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ విచారణ పై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేసును  ఈనెల 3కు కేసును వాయిదా వేసింది. అయితే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా లడ్డు వివాదాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారని మాజీ సీఎం జగన్ ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాల అమలుపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. రాజకీయాలు చేశారని అర్థం వచ్చేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి నుంచి వైసీపీ తిరిగి రివర్స్ అయ్యింది. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తోంది.

తాజాగా పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు. తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా చెప్పలేదన్నారు.   విచారణ జరుగుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే అలా మాట్లాడారని.. నెయ్యి కల్తీ పై అందిన లేబరేటరీ నివేదికల్లో పొందుపరిచిన తేదీల్లో కొంత గందరగోళం ఉందని మాత్రమే జడ్జీలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. తదుపరి విచారణలో వాటిపై స్పష్టత ఇస్తామని చెప్పుకొచ్చారు. ఒక్క లడ్డు ప్రసాదం గురించే కాకుండా.. గత ఐదేళ్లలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయో.. వాటన్నింటిని కోర్టు ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.  అలాగే తన ప్రాయశ్చిత్త దీక్ష పై కూడా పవన్ స్పష్టతనిచ్చారు. కేవలం లడ్డు వివాదంపై తాను దీక్ష చేపట్టలేదని.. దాని ఉద్దేశం వేరే ఉందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని గుర్తు చేశారు. హిందూ సనాతన ధర్మంపై దాడులు జరిగాయని వాటిన్నింటి కోసమే ప్రాయశ్చిత దీక్ష చేపట్టానన్నారు.

TAGS