CM Chandrababu : అక్టోబరు 4లోగా వరదసాయం అందించాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : వరద బాధితులకు సాయంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి, అక్టోబరు 4 నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద బాధితులందరికీ ప్రభుత్వ సాయం చేరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో విపత్తు నిర్వహణశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం సాంకేతిక కారణాల వల్ల ఆర్థిక ప్యాకేజీ అందని బాధితులకు తక్షణం సమస్యను పరిష్కరించి ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆదేశించారు.

ఆధార్ సీడింగ్ లేకపోవడం, బ్యాంకుల్లో కేవైసీ అప్ డేట్ కాకపోవడం, సిబ్బంది తప్పుడు వివరాలు నమోదు చేయడం సహా వివిధ కారణాలతో చాలా మందికి ప్రభుత్వం అందించిన వరద సాయం నిలిచిపోయింది. ఇలాంటి వారందరి సమస్యలను తక్షణం పరిష్కరించి వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై చర్చించారు.

లబ్ధిదారుల ఖాతాల్లో రూ.588.59 కోట్లు జమయ్యాయి. 97% మంది ఖాతాల్లోకి నగదు చేరిందని అధికారులు సీఎంకు వివరించారు. సాంకేతిక సమస్యల కారణంగా 22,185 మంది ఖాతాల్లో సాయం జమకాలేదు. బ్యాంకులు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని వారికి సూచించాం. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఖాతాల్లో డబ్బు పడని వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

TAGS