Lockdown effect : లాక్డౌన్ ఎఫెక్ట్.. చంద్రుని ఉపరితలంపై తగ్గిన ఉష్ణోగ్రత
Lockdown effect on Moon : కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమి పైనే కాకుండా చంద్రునిపై కూడా పడింది. లాక్ డౌన్ కారణంగా అనేక దేశాలలో పరిశ్రమలు మూసివేశారు. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. కాలుష్యంలో భారీ తగ్గింపు నమోదైంది. ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రభావం భూమి నుంచి చంద్రునికి విస్తరించిందని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా మారిందని తెలిపింది.
ఏప్రిల్ – మే 2020లో కఠినమైన లాక్ డౌన్ సమయంలో చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రత 8 నుంచి 10 కెల్విన్లకు పడిపోయిందని భారతీయ శాస్త్రవేత్తలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన ఈ నివేదిక ప్రకారం.. శాస్త్రవేత్తలు 2017 నుంచి 2023 వరకు చంద్రుని యొక్క వివిధ భాగాలపై ఉష్ణోగ్రతను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో లాక్ డౌన్ సమయంలో ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదల ఉన్నట్లు కనుగొన్నారు.