Revanth : హైడ్రా ప్రభుత్వం ప్రతిష్టను మసకబారుస్తుందా.. రేవంత్ కు అధికారం అప్పుడే చేదు అయిందా ?

Revanth

Revanth

CM Revanth : తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్) పదేళ్ల పాటు అధికారం చేపట్టింది. తనకు ఎదురేలేదనుకున్న కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీలను వరుసగా రెండు ఎన్నికలలో చిత్తు చేసిన  ఘనుడు రేవంత్‌ రెడ్డి. పార్టీలో సీనియర్లకీ అందరికీ పూర్తి స్వేచ్చ ఇచ్చినా ఎవరూ కూడా ఇది వరకటిలా ప్రస్తుతం రేవంత్‌ రెడ్డిని విమర్శించలేకపోతున్నారు. అంటే ఇటు ప్రభుత్వంపై, అటు పార్టీపై కూడా రేవంత్‌ రెడ్డి పూర్తి పట్టు సాధించిన్నట్లు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం.. కొన్ని సంక్షేమ పధకాలు అమలుచేసి ప్రజల మెప్పు కూడా పొందింది. ఇవన్నీ కేవలం ఎనిమిది నెలల్లోనే ఇదంతా సాధించగలిగారు. కానీ హైడ్రాని రంగంలో దించడంతో కేవలం మూడు నెలల్లోనే భవనాలతో పాటు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిష్టని మసకబార్చేస్తోంది. హైడ్రా మొదట నాగార్జున న్‌ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు అందరూ ‘ఆహా ఓహో’ అంటూ పొగిడేశారు. ఆ తర్వాత అది బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, కేటీఆర్‌ తదితరుల ఇళ్లపై పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బుల్డోజర్లు దిశ మార్చుకుని నిరుపేద, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడం మొదలు పెట్టింది.

హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్‌లో వందలాది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఏదో చేస్తారని గెలిపించుకుంటూ తమను నట్టెంట ముంచాడని రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు. తమ జీవితకాలం కష్టార్జితాన్ని రేవంత్‌ రెడ్డి ఒక్క నిమిషంలో కూల్చివేసి రోడ్డున పడేశారని కన్నీటి పర్వంతం అవుతున్నారు. ఇళ్ళు కూలిపోయి ఏడుస్తుంటే, బ్యాంకు వాళ్లు ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటే కంటి మీద కునుకు లేకుండా పోయిందని, తమకు చావే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల గోడు అన్ని పత్రికలు, అన్ని న్యూస్ ఛానల్స్‌లో వస్తూనే ఉన్నాయి. కనుక సిఎం రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియదని అనుకోలేం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ స్పందించడం లేదు. చివరికి ఇటువంటి సందర్భాలలో చాలా ధైర్యంగా మాట్లాడే సీనియర్ నేత వి.హనుమంత రావు కూడా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్‌ నేతలందరినీ రేవంత్‌ రెడ్డి ఇంతగా ఎలా గ్రిప్ లో పెట్టుకున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు.

కాంగ్రెస్‌ నేతలు స్పందించక పోవడంతో హైడ్రా బాధితులు అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ కార్యాలయానికి పోటెత్తారు. తమ బాధలను మాజీ మంత్రి హరీష్ రావుకి మొరపెట్టుకుంటున్నారు. వారికి ఆయన ధైర్యం చెప్పి రేపటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని.. హైడ్రాని అడ్డుకుంటామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ఈ స్థాయికి రావడానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, అవరోధాలు, అవమానాలు భరించారు. అసలు తెలంగాణలో కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీ ఉండగా మరో పార్టీ ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదనే భావన అప్పట్లో అందరిలో నెలకొని ఉండేది. కానీ రేవంత్‌ రెడ్డి ఆ అవరోధాలటినీ అధిగమించి, కేసీఆర్‌ని మట్టి కరిపించి సీఎం పదవి చేప్పట్టారు. కానీ హైడ్రాతో ఇప్పుడు ఆయనే స్వయంగా హైదరాబాద్‌ ఓటర్లను, ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఓటర్లను బిఆర్ఎస్ వద్దకు పంపిస్తున్నట్లున్నారు. ఇంతకాలం సరైన అవకాశం దొరక్క ఢీలాపడిన సదరు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రజలే తమని వెతుకుంటూ వస్తుంటే వద్దనుకుంటుందా.. ఊరుకుంటుందా? హైడ్రాతో ప్రజలలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని తెలుస్తున్నా రేవంత్‌ రెడ్డి దానికి చట్టబద్దత కల్పించి, అధికారులు సిబ్బందిని కేటాయించి దాని పరిధిని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడనప్పటికీ హైడ్రాని వ్యతిరేకిస్తున్న వారు తప్పకుండా ఉంటారు. వారు ఏకమై కేసీఆర్‌తో చేతులు కలిపితే రేవంత్‌ రెడ్డి సర్కార్ కూలిపోయే ప్రమాదం ఉంది.  ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి ప్రజల ఆక్రోశం, వారి ఆక్రందనలు వినిపించుకోకపోతే ఆయనకే ప్రమాదం.

TAGS