Artificial rains : ఢిల్లీలో కృత్రిమ వర్షాలు : పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్
Artificial rains in Delhi : ఢిల్లీలో కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నవంబరు 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు. ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొవడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు.
2016-2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని వివరించారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్ స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామని మంత్రి తెలిపారు.
రాజధాని ప్రాంతంలో ఏటా అక్టోబరు చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరేతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగులబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈసారి కూడా వాయు కాలుష్యాన్ని ఎదుర్కునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.