Nimmala Ramanaidu : గండ్ల పూడికతీత పనులు పూర్తి చేయాలి : మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu : ఏపీలో వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలు, డ్రైనేజీలు, చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావులతో కలిసి తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు రాష్ట్రంలోని జల వనరుల శాఖ సీఈ, ఎస్ఈ, ఈఈలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టం, గండ్లు పూడిక పనులపై జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈ, ఈఈలతో అత్యవసర సమావేశంలో చర్చించారు.
గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించి వాటిని వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన గండ్లకు కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆఖరి ఎకరం వరకు రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. గోదావరి డెల్టా సిస్టంలో ప్రధానంగా ఏలేరు, అమ్మిలేరు, ఎర్ర కాలువ, బుడమేరు, కొల్లేరుకు సంబంధించి గండ్లతో పాటు ఆక్రమణలనూ గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.