Atishi Marlena : ఎవరీ అతిషి మర్లెనా.. ఢిల్లీ సీఎంగా ఎంపికలో సమీకరణాలేంటి?

Delhi CM Atishi Marlena : రెండు రోజుల క్రితం చెప్పినట్లుగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన తదుపరి సీఎంను ఎంపిక చేశారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న అతిషిని తదుపరి ముఖ్యమంత్రిని చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆప్ నేతలందరూ అతిషి పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో అతీషి సీఎంగా ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. ఆమె కంటే ముందు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఈ పదవి చేపట్టారు.

ఆప్ లో కీలక నేత..

ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మర్లెనా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. సామాజిక కార్యకర్తగా అతీషి తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అతిషి ప్రస్తుతం ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఢిల్లీ విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే పీడబ్ల్యూడీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుల్లో అతీషి ఒకరు.

అతీషి మూలాలు..
అతిషి 8 జూన్ 1981న ఢిల్లీలో జన్మించారు. అతని ఆమె తల్లిదండ్రులు, విజయ్ సింగ్, త్రిప్తా వాహి, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు. ఆమె ఢిల్లీలోని స్ప్రింగ్‌ డేల్స్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. చెవెనింగ్ స్కాలర్‌షిప్‌పై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రాచీన, ఆధునిక చరిత్రలో మాస్టర్స్ చేశారు.

పార్టీ పదవులు..

ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, బలమైన పునాది నిర్మించడంలో అతిశి కృషి ఎంతో ఉంది. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లడంతో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర..

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేశారు. అతీషి గతంలో మనీష్ సిసోడియాకు సలహాదారుగా కూడా పనిచేశారు. విద్యా విధానాలను రూపొందించడంలో కీలకపాత్ర పాత్ర పోషించారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు.

TAGS