Vallabaneni Vamshi : హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట
Vallabaneni Vamshi : వైసీపీ హయాంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే కొడాలి నానిపై కేసులతో వెంటాడుతుండగా.. తాజాగా వల్లభనేని వంశీ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో గన్నవరంలో వంశీ ఎమ్మెల్యేగా వెలుగు వెలిగారు. అక్కడ టీడీపీ ప్రభుత్వంతో నువ్వా నేనా? అన్నట్టుగా తలపడ్డారు. అయితే వైసీపీ ఓడిపోవడంతో ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది.
వల్లభనేని వంశీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండగా గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంలోని ఫర్నీచర్‌తో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడికి సూత్రధారులంతా వల్లభనేని వంశీ అనుచరులని ప్రధాన ఆరోపణ. ఇప్పటికే వంశీ కీలక అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయగా.. నిందితుల్లో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు చెప్పడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముందస్తు బెయిల్ కోసం వంశీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. కక్ష సాధింపు కారణంగానే ఈ వ్యాజ్యం దాఖలయ్యిందని వంశీ తరపు న్యాయవాది చర్చించగా, దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే వంశీ హస్తం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది చర్చించారు. ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర హైకోర్టు.. ఈ నెల 20వ తేదీలోపు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
దీంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని చూసిన పోలీసులకు, కూటమిసర్కార్ కు గట్టి షాక్ తగిలినట్టైంది.