Anna canteens : అన్న క్యాంటీన్ల మెనూ ఇదే.. రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనం
Anna canteens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మొదటి దశలో 100 అన్న క్యాంటీన్ల జాబితాను విడుదల చేసింది. మొదటి దశలో ప్రభుత్వం 17 జిల్లాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే 16న రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ఈనెల 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తొలి దశలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆగస్టు 15న కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. మిగిలిన జిల్లాల్లో ఎంపిక చేసిన 33 మున్సిపల్, నగరపాలక సంస్థల్లో ఇలాంటి క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గుడివాడలో సీఎం పర్యటనకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఏఎన్ఆర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియంలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేయాలనే దానిపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. 16వ తేదీ నుంచి ఈ క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
అయితే, అన్న క్యాంటీన్లో ప్రజలకు అందించే ఆహారం కోసం మెనూ సిద్ధం అయింది. ఉదయం అల్పాహారంలో భాగంగా సోమవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందించబడుతుంది. లేదంటే పూరీ, కూర్మాలుంటాయి. మంగళవారం నాడు ఇడ్లీతో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఉంటుంది.. లేదా చట్నీ, పొడి, సాంబార్, ఉప్మా వడ్డిస్తారు. బుధవారం నాడు ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్.. లేదా పొంగల్ ఉంటుంది. గురువారం నాడు ఇడ్లీతో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పూరీ కుర్మా… శుక్రవారం నాడు ఇడ్లీతో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా ఉప్మాతో చట్నీ లేదా పొడి లేదా సాంబార్.
భోజనం విషయంలో వారానికి ఏడు రోజులు మెనూ ఒకే విధంగా ఉంటుంది. కానీ, కూర మాత్రం రోజుకో వెరైటీగా ఉండబోతోంది. తెల్లటి అన్నం, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, ఆకుకూరలు అందిస్తారు. అల్పాహారంలో ఒక్కొక్కరికి 3 చొప్పున ఇడ్లీ, పూరీ వడ్డిస్తారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు అందిస్తారు. 400 గ్రాముల తెల్ల అన్నం, 15 గ్రాముల చట్నీ లేదా పొడి, 150 గ్రాముల సాంబార్, 25 గ్రాముల మిశ్రమం, 100 గ్రాముల కూర, 120 గ్రాముల పప్పు లేదా సాంబార్, 15 గ్రాముల పచ్చడి, 75 గ్రాముల పెరుగు వడ్డిస్తారు. అల్పాహారం ఉదయం 7.30 నుండి 10 గంటల మధ్య ఉంటుంది. మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల మధ్య భోజనం ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 నుండి 9 గంటల మధ్య రాత్రి భోజనం. ఆదివారం అన్నా క్యాంటీన్‌కు సెలవు. అలాగే వారానికోసారి స్పెషల్ రైస్ పెడుతారు.