BMTC bus : వాహనాలపైకి దూసుకొచ్చిన బీఎంటీసీ బస్సు..ప్రజల ప్రాణాలతో కర్నాటక సర్కార్ ఆటలు

BMTC bus

BMTC bus

BMTC bus : దేశంలో గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇంట్లోంచి బయటకు వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకుంటామా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మితిమీరిన వేగం, నిద్రలేమి, సరైన అనుభవం లేకపోవడం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అనేక కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారు.  అనాథలుగా మిగులుతున్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నా.. డ్రైవర్ల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ వోల్వో బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

కర్నాటకలోని ఉత్తర బెంగళూరులో రద్దీగా ఉండే హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై బీఎంటీసీకి చెందిన వోల్వా బస్సు ఇతర వాహనాలను ఢీకొట్టడంతో కలకలం సృష్టించింది. బస్సు డ్రైవర్‌ అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న వాహనాలను ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మూడు బైక్‌లు, రెండు కార్లు ఢీకొని బస్సు ఆగిపోయింది.  దీంతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక బైకర్‌కు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీఎంటీసీ(BMTC) అనగా బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్. ఇది భారతదేశంలోని బెంగళూరు నగరంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ రోడ్డు రవాణా సంస్థ. ఇది పూర్తిగా కర్నాటక ప్రభుత్వ ఆధీనంలో ఉంది.

ఇదిలా ఉండగా.. కర్నాటక రాష్ట్రంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్నారు. ఏప్రిల్ 2023 – మార్చి 2024 మధ్య రాష్ట్రంలో సుమారు 43,780 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 11,611 మంది మరణించారు. 51,207 మంది గాయాలతో చికిత్స పొందారు. రోడ్డు ప్రమాద మరణాల విషయంలో చండీగఢ్ తర్వాత కర్నాటక రెండో స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రెవెన్యూ, పోలీసు, రవాణా, పురపాలక శాఖ అధికారులు సమష్టిగా కృషి చేయాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

TAGS