Chinta Mohan : 13.5 లక్షల కోట్ల అప్పుల లెక్క చెప్పు ‘బాబు’ : చింతా మోహన్
Chinta Mohan : సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబును నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు గెలిచాక ఖజానా ఖాళీ అయ్యిందని.. జగన్ 13.5 లక్షల కోట్ల అప్పు చేసి పోయాడని.. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయమంటూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేశారు. దీంతో ప్రజలు సంక్షేమ పథకాలు అందక ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే జగన్ హయాంలో అమలైన పథకాలు.. చంద్రబాబు హయాంలో ఎందుకు అమలు కావడం లేదని.. చంద్రబాబు మాటిమాటికి చెబుతున్న 13.5 లక్షల కోట్ల అప్పుపై సమాచారం ఇవ్వాలని మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన డిమాండ్ చేశారు.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన 13.5 లక్షల కోట్ల అప్పుల వివరాలను.. ఆ మొత్తం ఖర్చు వివరాలను కూడా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అందించాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్ చేసిన అప్పు ఎంతో బయటపెట్టాలని కోరారు.
తాజాగా విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆ లెక్కలు బయటపెట్టాలని కోరారు. “మిస్టర్ చంద్రబాబు ఒక నెలలోపు ఈ అప్పుల సమాచారాన్ని అందించడంలో విఫలమైతే, నాకు యాక్సెస్ ఉన్న వివరాలతో నేను ఏపీ అప్పులు బయటపెడుతాను ” అని చింతా మోహన్ సంచలన ప్రకటన చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై గత రెండు దశాబ్దాలుగా చేసిన ఖర్చుల వివరాలను చంద్రబాబు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం పేరుతో *40,000 కోట్లకు పైగా దారి మళ్లించారని, ఇంకా 50,000 కోట్లు అవసరం ఉందని అనడం ఎంత వరకూ సమంజసమన్నారు. కుప్పం, తిరుపతిలను అమరావతి, పోలవరం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయడంపై కూడా చంద్రబాబు దృష్టి సారించాలని చింతా మోహన్ హితవు పలికారు.