KTPS : కేటీపీఎస్ లో కూలింగ్ టవర్ల కూల్చివేత
KTPS : భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేశారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్ 11న కర్మాగారం మూతపడింది. కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో 2023 జనవరి 18 నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత పనులు మొదలయ్యాయి. కేటీపీఎస్ లోని బాయిలర్, టర్బైన్లను తొలగించిన తర్వాత ఇంప్లోజన్ పద్ధతిలో 20 కేజీల పేలుడు పదార్థాలను అమర్చి కూలింగ్ టవర్లను కుప్పకూల్చారు.
రాజస్థాన్ లోని జైపూర్ నకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఈ ప్రక్రియను చేపట్టింది. ట్రాన్స్ కోతోపాటు జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన అనంతరం కూల్చివేత చేపట్టారు. 30 మంది సిబ్బంది నెల రోజుల పాటు సన్నాహాలు చేశారు. మొత్తం మూడు దశల్లో కూల్చివేత కొనసాగింది. ఆకాశమంత ఎత్తులో పదుల సంవత్సరాలుగా పాల్వంచ పట్టణ ప్రజల కళ్లకు కనిపించిన టవర్లు కూల్చివేస్తున్ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చారు.