Planes : వరద నీటిలోనే విమానాలు..
Planes : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాజధాని కోల్ కతాలోని విమానాశ్రయం వరదనీటితో నిండిపోయింది. విమానాలు పార్క్ చేసిన ప్రాంతంలోకి నీరు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కోల్ కతాతో పాట హావ్ డా, సాల్ట్ లేక్, బారక్ పోర్ లోని పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విమానాశ్రయంలోకి వరదనీరు రావడంతో రన్ వే, ట్యాక్సీవేలు నీటిమయంగా మారాయి. అయితే విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలుగలేదని సమాచారం.
ఉత్తరాదిని వరుణుడు వణికిస్తున్నాడు. ఆకస్మిక వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ లో ఒక ఊరే కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్ లో కేదార్ నాథ్ కు చేరుకునే మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.