Bangkok : టిక్కెట్లు ఎగ్గొట్టిన విమాన ఏజెన్సీ.. బ్యాంకాక్ లో ఇబ్బంది పడుతున్న ఆదిలాబాద్ వాసులు
Bangkok : విమానయాన ట్రావెల్ ఏజెన్సీ నిర్వాకం కారణంగా ఆదిలాబాద్ కు చెందిన పలువురు థాయ్ లాండ్ లోని పుకెట్ సమీపంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి సొంత డబ్బులు చెల్లించి బ్యాంకాక్ చేరుకున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పది మంది సభ్యులు వారం రోజుల విహారయాత్రకు ఈ నెల 20న శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ మీదుగా అదేరోజు రాత్రి థాయ్ లాండ్ లోని పుకెట్ కు చేరుకున్నారు. రెండు రోజులు అక్కడే బస చేసిన బృందం రానుపోను అన్నిరకాల ఛార్జీలతో వసతి కోసం ఒక్కో వ్యక్తికి రూ.42 వేలు ముందుగా నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ట్రావెల్ ఏజెన్సీకి చెల్లించారు. ఈ నెల 23న పుకెట్ నుంచి బ్యాంకాక్ బయలుదేరగా స్థానిక ట్రావెల్స్ విమాన టికెట్ తీయలేదని బయటపడింది. దీంతో ట్రావెల్ బస్సు డ్రైవర్ సహా సభ్యుల బృందం అక్కడి పెట్రోల్ బంక్ లోనే నిరీక్షించారు.
భైంసా ఏజెన్సీలో సంప్రదిస్తే టికెట్ తీసుకోవాలని తర్వాత ఫోన్ పే చేస్తానని నిర్వాహకుడు చెప్పాడు. గత్యంతరం లేక ఒక్కొక్కరు రూ.8,700 చొప్పున పదిమందికి రూ.87 వేలు చెల్లించి బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఈ నెల 27న హైదరాబాద్ వచ్చినప్పటికీ నిర్వాహకుడు డబ్బులు చెల్లించకుండా ఫోన్ నంబర్లను బ్లాక్ లో పెట్టాడు. ఈ విషయంపై భైంసా ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు యాత్రికులు తెలిపారు.