Jagan : ‘‘తానొకటి తలిస్తే..’’ అన్నట్లు తయారైన జగన్ పరిస్థితి!
Jagan : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా వైసీపీని వీడి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నారా లోకేశ్‌ను మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జకియా ఖానుమ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు పార్టీ మారతారని, వాళ్లను ఎలా కాపాడుకోవాలంటూ జగన్ ఆలోచిస్తుంటే.. అధికార పార్టీ మాత్రం అటు నుంచి తెరవెనుక మంతనాలు నడుపుతున్నట్లు కనిపిస్తోంది. శాసన సభలో తమకు కావాల్సినంత బలం ఉండటంతో.. కేవలం శాసనమండలిపైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాల అనంతరం వైసీపీ నుంచి వలసలు మొదలు అవుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానుమ్ మంత్రి లోకేష్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఒకటి రెండు రోజుల్లో ఆమె టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరిగి వచ్చాక ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతారని అంటున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కూటమి పార్టీల నుంచి ముఖ్యంగా టీడీపీ, జనసేన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేకపోవడంతో వారంతా కాస్త సైలెంట్ అయ్యారు. అయితే, గత కొద్ది రోజులుగా మంత్రి , ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతోన్న మండలి డిప్యూటీ చైర్మన్ తాజాగా లోకేష్ ను కలవడంతో ఆమె టీడీపీలో చేరిక దాదాపు కన్ఫాం అయినట్టేననే టాక్ నడుస్తోంది.
శాసన మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీతో ఉంది. దీంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని జగన్ భావించారు. ఈమేరకు ఏనాడూ ఎమ్మెల్సీలను పెద్దగా పట్టించుకోని జగన్..ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి వారితో భేటీ అయి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీలను నెత్తిన పెట్టుకోవడానికి ఆయన స్వీయ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఎమ్మెల్సీలు తమ సన్నిహిత నేతల వద్ద అభిప్రాయపడినట్లు తెలిసింది.