KCR and Jagan : కేసీఆర్, జగన్ ల దారులు వేరు.. కేంద్రంలో ఎవరు ఎవరితోనంటే?

KCR and Jagan : ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్‌ పరిస్థితి ఒకేలా ఉన్నాయి. ఇద్దరి నెత్తిపై కేసుల కత్తులు వేలాడుతున్నాయి. తమకు ఎదురే లేదనుకొని విచ్చల విడిగా పరవర్తించిన ఈ రెండు పార్టీలు అడ్రస్ లేకుండా పోయేలా ఉన్నాయి. కనుక ఇద్దరికీ ‘జాతీయ రక్షణ కవచాలు’ చాలా అవసరం.

జగన్, కేసీఆర్ మంచి స్నేహితులే అయినా సమస్యలు, అవసరాలను బట్టి వేర్వేరు దారుల్లో ప్రయాణించడం వారికి తప్పేలా కనిపించడం లేదు. నాలుగు నెలలుగా తీహార్ జైలులో మగ్గుతున్న కూతురు కల్వకుంట్ల కవితను విడిపించుకునేందుకు, రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీని కాపాడుకొని ఏదో విధంగా అధికారం దక్కించుకునేందుకు కేసీఆర్‌ తెర వెనుక బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఎవరూ ఖండించడం లేదు కూడా. అంటే అవి నిజమని భావించవచ్చు. కానీ ఇప్పుడు అవసరం కేసీఆర్‌దే తప్ప బీజేపీది కాదు.. కనుక బీఆర్ఎస్ తో పొత్తుకు కమల దళం అంగీకరించకపోవచ్చు. కానీ లోపాయికారిగా సహకరించుకునే అవకాశం ఉంది.

కేసీఆర్ బీజేపీ వైపు వెళ్తుండగా.. తన స్నేహితుడు జగన్ ను తీసుకురావడంలో విఫలమైనట్లు కనిపిస్తుంది. ఇటీవల ఢిల్లీలో ధర్నాలో ఈ విషయం బయట పడింది. ఈ ఢిల్లీ నిరసనకు కాంగ్రెస్‌ మిత్రపక్షాలు వచ్చి సంఘీభావం తెలిపాయి. తన సోదరి వైఎస్ షర్మిల బెడద వదిలించుకొని వైసీపీని మరింత స్టెంథన్ చేసుకునేందుకు జగన్‌ కాంగ్రెస్‌ వైపునకు చూస్తున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ నేటికీ కోలుకోలేకడం లేదు.

తిరిగి జవసత్వాలు రావాలని వైఎస్ షర్మిలకు పగ్గాలు అప్పగించింది. కానీ ఆమె కూడా ఒక్క సీటు తీసుకురాలేకపోయింది. కనీసం ఒక్క సీనియర్ వైసీపీ నేతని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించలేకపోయారు. కనుక వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి తన నాయకత్వాన్ని అంగీకరించాలని కోరుతున్న జగన్ తో అన్ని విధాలా కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని అధిష్టానం భావించడంలో ఆశ్చర్యం లేదు. అదీగాక ఏపీలో కాంగ్రెస్‌, వైసీపీ రెండూ ఒకే పరిస్థితిలో ఉన్నాయి. కనుక కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే, జగన్‌, కేసీఆర్‌ ఎవరి దారిన వారు చూసుకున్నట్లు.

కానీ ప్రధాని మోడీని అవమానించి, హేళన చేసి, గద్దె దించాలనుకున్న కేసీఆర్‌ కు బీజేపీ కమలం పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఒకవేళ కేసీఆర్‌తో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకొని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని సిద్ధపడితే. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకుంటారా? ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిలను పంపించిన రేవంత్‌ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను బయటకు పంపించి జగన్ ను  తెచ్చుకుంటానంటే అంగీకరిస్తారా..? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభిస్తాయి.

TAGS