KCR : ఆ హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. స్వాగతం పలికిన అసెంబ్లీ కార్యదర్శి.. ఆయనకు కేటాయించిన ఛాంబర్ కూడా అదే?
KCR : పాలకపక్షం విమర్శలు, ఆరోపణల మధ్య ఈ రోజు (జూలై 25-గురువారం) తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలిసారిగా సమావేశాలకు వచ్చారు. ఆయన రావడంతో అసెంబ్లీ కార్యదర్శి బొకే అందజేసి స్వాగతం తెలిపారు. పదేళ్లు సీఎంగా ఉన్న ఆయన గతేడాది ఎన్నికల్లో ఓటమి పాలవడంతో అప్పటి నుంచి అసెంబ్లీకి రాలేదు. ఒక్క సారి మాత్రమే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి కేసీఆర్ సమావేశాలకు రావడం మానేశారు. దీంతో లీడర్ ఆఫ్ ది హౌజ్ కేసీఆర్ పేరుతో విమర్శలు కురిపించారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిన రెండు రోజులకే కేసీఆర్ ఫాం హౌస్లో జారిపడి గాయాలపాలయ్యారు. కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆ సమయంలో సీఎం స్థానంలో రేవంత్ ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ ను పరామర్శించారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. కోలుకున్న తర్వాత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. ఆపరేషన్ తర్వాత కోలుకున్నా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు.
పాలక ప్రభుత్వం కాంగ్రెస్ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నందీనగర్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతారా? కారా? అన్న చర్చ కొద్ది రోజులుగా జరుగుతోంది.
బుధవారం అసెంబ్లీలో సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రతిపక్షనేత ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఎందుకు అసెంబ్లీకి రారని ప్రశ్నించారు. ఈ నేపథ్యలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా గేట్ నెం. 2 నుంచి సభలోకి ప్రవేశించారు. 9 ఏళ్ల పాటు గేట్ నెం. 1 నుంచి మాత్రమే సభలోకి ప్రవేశించేవారు. మరో వైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన ఛాంబర్ ను ఆయనకు కేటాయించినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపారు.