Railway budget : రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.5,336 కోట్లు
Railway budget : తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి 2009-14 మధ్య ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్ల కన్నా ఆరు రెట్లు అధికమని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని రైల్వే భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.32,946 కోట్లు విలువైన 20 ప్రాజెక్టు కింద 2,298 కిలో మీటర్ల కొత్త ట్రాక్ ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 40 రైల్వే స్టేషన్లలో విస్తృతస్థాయిలో మరమ్మతులు జరిపి పూర్తిగా ఆధునికీకరించామని, వాటిని అమృత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో నూటికి నూరు శాతం రైల్వే విద్యుద్దీకరణ జరిగిందన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోందని మంత్రి వివరించారు. 2014 నుంచి తెలంగాణలో 437 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జులను నిర్మించామని తెలిపారు.