AP Railway Budget : ఏపీ రైల్వే బడ్జెట్ రూ.9వేల కోట్లు.. హర్షం వ్యక్తం చేస్తున్న రాష్ట్రప్రజలు

AP Railway Budget

AP Railway Budget

AP Railway Budget : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే పది రెట్లు పెంచినట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..

రాష్ట్రంలో మొత్తం రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో కూడా వంద శాతం రైల్వేలు విద్యుద్దీకరణ జరిగాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏపీ రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏపీలో పదేళ్ల కాలంలో 743 అండర్‌ పాస్‌లు, పైవంతెనల నిర్మాణం జరిగిందన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌(విశాఖ రైల్వే జోన్)కు భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని రైల్వేకు ఇతర భూములు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రైల్వేకు భూకేటాయింపులపై ఇటీవల చర్చలు కూడా జరిగాయన్నారు.

అమరావతిని అనుసంధానిస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు మొదలు కానుందని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఎర్రుపాలెం- కొండపల్లి- నంబూరు మీదుగా రైల్వే లైను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతిఆయోగ్‌ ఆమోదించిందన్నారు. ఇక, అమరావతి, విజయవాడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.  ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై లోక్‌సభలో ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్  సమాధానమిచ్చారు. మరోవైపు, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు.

TAGS