Jagan : జగన్ ఢిల్లీ ధర్నాకు ఆ ఎమ్మెల్సీలు దూరం!
Jagan Delhi Dharna : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో హింస, అరాచకాల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఈ నెల 25న బుధవారం ఢిల్లీలో వైసీపీ ధర్నా నిర్వహించనుంది. ఈ నిరసన కార్యక్రమంతో పాటు ఫొటో గ్యాలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో 45 రోజులుగా సాగుతున్న నిరసనలను వైసీపీ దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తుంది. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జగన్ వెంట ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1050 దాడులు, దౌర్జన్యాలు, 300 హత్యాయత్నాలు, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగాయని జగన్ చెబుతున్నారు. మరో 2,700 కుటుంబాలు ప్రాణభయంతో గ్రామాలను వదిలి వెళ్లే పరిస్థితిని సంకీర్ణ ప్రభుత్వం తీసుకొచ్చిందని వాపోతున్నారు. ఈ ధర్నా సందర్భంగా జగన్, పార్టీ నేతలు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. వైసీపీ ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, వివిధ మంత్రుల అపాయింట్మెంట్ కోరింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 22న ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులను వివరించారు. వైసీపీ నేతలు, పార్టీ సానుభూతిపరుల హత్యలు, హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ ధర్నాను విజయవంతం చేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది. అందుకే పార్టీ ప్రతినిధులను అంతా ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఢిల్లీ బాట పట్టింది.
జగన్ ఢిల్లీ వెళ్లినా.. ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం మంగళవారం మండలికి హాజరయ్యారు. మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కారని జగన్ ముందే ప్రకటించారు. కానీ, మాధవరావు, రవీంద్రలు కౌన్సిల్ కు హాజరు కావడంతో .. కూటమి సభ్యులు.. మీరు ఢిల్లీ వెళ్లలేదా…? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీలంతా ఢిల్లీ వెళ్తే.. ఈ ఇద్దరు మాత్రమే మండలికి హాజరు కావడంతో వీరు త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.