KTR : పాపం కేటీఆర్.. కాంగ్రెస్ కు మరోసారి దొరికిపోయారుగా! ఆడుకున్న హస్తం పార్టీ..
KTR : మొన్నటి వరకు పంట రుణాల మాఫీ ఎక్కడ అని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ వీడియోను పోస్ట్ చేశారు. ‘కాంగ్రెస్ కుట్రలన్నీ గోదాట్లో కొట్టుకుపోగా మేడిగడ్డ బ్యారేజీ మాత్రం ఠీవిగా నిలబడి ఉంది’ అంటూ కవిత్వం ఒలకబోశారు.
మేడిగడ్డ బ్యారేజీలో త్రీ పియర్స్ కుంగిప్పటికీ ప్రాజెక్ట్ దివ్యంగా ఉందనీ, కానీ రేవంత్ తమని అప్రదిష్టపాలు జేసేందుకే ప్రాజెక్టు మొత్తం దెబ్బతిందన్నట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
దానికి తెలంగాణ కాంగ్రెస్ అంతే ధీటుగా బదులిచ్చింది. ‘మీ ‘కాళేశ్వరరావు’ కమిషన్లకు కక్కుర్తితో పేకమేడలాంటి ప్రాజెక్ట్ కట్టాడు. మేడిగడ్డ బ్యారేజీలో గేట్లు మూసి నీటిని నిలిపితే ప్రాజెక్ట్ ఆనవాళ్లు కనిపించకుండా కొట్టుకుపోతుంది. అందుకే ఎగువ నుంచి వచ్చింది వచ్చినట్లు వస్తున్న వరదను దిగువకు వదిలేస్తున్నాం. దీంతో విలువైన నీరు సముద్రం పాలవుతుంది. సాగు, తాగునీటికి పనికి వచ్చే విలువైన నదీ జలాలు సముద్రం పాలువుతుంటే సన్నాసులు.. సంకలు గుద్దుకుంటున్నారు.’ అంటూ బదులిచ్చింది.
మాజీ సీఎం కేసీఆర్ దగ్గరుండి డిజైన్ చేయించి యావత్ ప్రపంచమే అబ్బురపడేలా మూడేళ్లలో కాళేశ్వరం కట్టించానని గొప్పలు చెప్పుకునేవారు. కానీ ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే ప్రాజెక్టులో మొదటిది, కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగిపోయాయి!
దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తే తమ పరువే పోతుందని బీఆర్ఎస్ కొన్ని నెలలుగా వెనక్కు తగ్గుతూనే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తలుచుకుంటే మేడిగడ్డ బ్యారేజీ గేట్లన్నీ మూయించేయగలదు. అప్పుడు నీటి ఒత్తిడి తట్టుకోలేక మరిన్ని పిల్లర్లు కుంగి ఉండేవి. అదే జరిగితే కేసీఆర్ పరువు మేడిగడ్డలో కొట్టుకుపోయి ఉండేది.
కానీ రాజకీయాల కోసం మేడిగడ్డ బ్యారేజీని దెబ్బతీసుకొని రాష్ట్రానికి నష్టం కలిగించడం సరికాదని సీఎం రేవంత్ భావించడం వల్లే వరద నీటిని దిగువకు విడిచిపెట్టి బ్యారేజీని కాపాడుకుంటున్నారు. ఇది గమనించకుండా వరద నీటితో మేడిగడ్డ నిండుగా ఉందంటూ కేటీఆర్ తొందరపడి ట్వీట్ వేసి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ దొరికిపోయారు పాపం!.