Gurupurnami Celebrations : భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు..‘‘జైసాయిరాం’’ నినాదాలతో మార్మోగిన ఎడిసన్ నగరం
Gurupurnami Celebrations : గురుపౌర్ణమి వేడుకలు భారత దేశంలోనే కాదు వివిధ దేశాల్లో సైతం ఘనంగా జరిగాయి. లక్షలాది భారతీయులు ఉన్న అమెరికాలో గురుపౌర్ణమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురుపౌర్ణమి పండుగను ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిథి రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది.
ఈ ఏడాది పౌర్ణమి తిథి జూలై 20న ప్రారంభమై జూలై 21న ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, గురుపౌర్ణమి సందర్భంగా గురువులను సేవించి, ఆశీర్వాదం తీసుకుంటే జాతకంలో గురు దోషం పోవడంతో పాటు, సంతోషం, సౌభాగ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు. గురుపౌర్ణమి సందర్భంగా విష్ణుమూర్తి, దత్తాత్రేయ, సాయిబాబా వంటి దేవతలను పూజిస్తారనే విషయం తెలిసిందే.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయిదత్తా పీఠం, కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఎడిసన్ నగరంలోని 1665-370 ఓక్ ట్రీ రోడ్ లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ లో శనివారం, ఆదివారం(జూలై 20,21) రెండ్రోజుల పాటు వేడుకలు జరిగాయి.
శనివారం జరిగిన కార్యక్రమాలు:
ఉదయం 5:45 గంటలకు కకడ్ హారతితో పూజలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుప్రభాత సేవ, గణపతి పూజ తదితర పూజలు, 7:00 గంటలకు బాబా మరియు నవగ్రహ అభిషేకం, 10:30 గంటలకు సామూహిక బాబా లక్ష పుష్పార్చన, 11:30 గంటలకు వ్యాసపూజ, గురు పూజ, మధ్యాహ్నం 3:00 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. రాత్రి 9గంటల నుంచి 21వ తేదీ ఉదయం 6గంటలకు వరకు నామ సంకీర్తన, భజన కార్యక్రమాన్ని ఎస్ డీపీ అయ్యప్ప గ్రూప్, ఎస్ డీపీ(సాయి దత్తా పీఠం) గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆదివారం జరిగిన పూజా కార్యక్రమాలు:
ఉదయం 7 గంటలకు బాబాకు అభిషేకం, దత్తా పరంపర నిర్వహించారు. 9:30 గంటలకు సామూహిక సాయి సత్య వ్రతం, సాయంత్రం 6 గంటలకు పల్లకీ సేవ, 6:30 గంటలకు పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లకీ ఉత్సవం సందర్భంగా వందలాది భక్తులు సాయిబాబా పాటలతో ఆడిపాడారు. చిన్నా, పేద తేడా లేకుండా సాయి నామ స్మరణలో మునిగితేలారు. జై సాయిరాం..నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : Gurupoornima Celebrations Pallaki Seva & Utsavam at SDP SSV Temple