Karnataka : రిజర్వేషన్ల బిల్లును పక్కన పెట్టిన కర్ణాటక
Karnataka : కన్నడిగులకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం పక్కన పెట్టింది. పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు కర్ణాటక ఉపాధి బిల్లు, 2024 ను రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఈ బిల్లు దృష్ట్యా సిద్ధరామయ్య ప్రభుత్వం పరిశ్రమ నుండి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. కన్నడిగులకు ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి కేబినెట్ ఆమోదించిన బిల్లును తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై రానున్న రోజుల్లో పునరాలోచించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏదైనా పరిశ్రమ, ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ కేటగిరీలలో 50 శాతం స్థానిక అభ్యర్థులను, నాన్-మేనేజ్‌మెంట్ కేటగిరీలలో 70 శాతం స్థానిక అభ్యర్థులను నియమించాలని బిల్లు పేర్కొంది. కన్నడ మాట్లాడేవారికి 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని వ్యాపార దిగ్గజాలు, సాంకేతిక రంగ ప్రముఖులు తీవ్రంగా విమర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కన్నడ మాట్లాడే వారికి ప్రైవేట్ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో చేసిన పోస్ట్‌ను తొలగించారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ పరిశ్రమలు, ఇతర సంస్థల్లో కన్నడ మాట్లాడే వారికి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 75 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్‌లో తెలిపారు. మంగళవారం ట్విటర్‌లో విడుదల చేసిన పోస్ట్‌లో “రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పరిశ్రమలలో కన్నడ మాట్లాడేవారికి 100 శాతం ‘సి’, ‘డి’ కేటగిరీ ఉద్యోగాలను రిజర్వ్ చేసే బిల్లుకు నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదించింది.’’ అని రాసుకొచ్చారు.
కన్నడ మాట్లాడే వారితో పాటు పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్చలు జరుపుతుందని కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యస్థ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ బుధవారం తెలిపారు. కన్నడ మాట్లాడేవారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ-బీటీ మంత్రి, న్యాయశాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రితో చర్చిస్తానని పాటిల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.