KCR petition : కేసీఆర్ పిటిషన్పై సుప్రీం సంచలన ఆదేశాలు.. ఆ సమావేశం ఎలా పెడతారని ప్రభుత్వానికి చురకలు..
KCR petition : బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం, అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు ఈ రోజు (జూలై 16) విచారణ చేపట్టంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఇరుపక్షాలు వారి వారి వాదనలు వినిపించారు. పిటిషనర్ తరుఫు ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు.
ఇది రాజకీయ కక్షతో వేసిన కమిషన్ అని ముకుల్ రోహత్గీ వాదించారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ మాజీలపై ఇలాంటి కేసులు వేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందని రోహత్గీ బెంచ్ కు వివరించారు. విద్యుత్ విచారణ కమిషన్ ను నియమించడంలో ప్రభుత్వం పరిధిని అతిక్రమించిందన్నారు. ట్రిబ్యునల్స్ ఉండగా.. కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారన్నారని ప్రశ్నించారు.
కొత్త రాష్ట్రం ఏర్పడడంతో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. మార్కెట్ ధర కంటే తక్కువగా యూనిట్ కు రూ. 3.90 చెల్లించి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని, విచారణకు ముందే కమిషన్ చైర్మన్ నరిసింహా రెడ్డి ప్రెస్మీట్ పెట్టి దోషిగా తేల్చారాని వాదించారు. ఈఆర్సీ ఉందని, విచారణ కమిషన్ అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరపు లాయర్ లుథ్రా.. ప్రెస్ మీట్లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని బెంచ్ కు వెల్లడించారు. దేశంలో అన్ని పవర్ ప్రాజెక్టులు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుంటే.. భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. దీని వలన ప్రభుత్వ ఖజానాపై భారం భారీగా పెరిగిందన్నారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్మీట్ ఎలా పెడతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. కమిషన్ చైర్మన్ ప్రెస్మీట్ పెట్టడాన్ని సీజేఐ తప్పుబట్టారు. కమిషన్ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తుందని ప్రశ్నించారు. కమిషన్ చైర్మన్ న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కమిషన్ నుంచి నరసింహా రెడ్డిని తప్పించి కొత్తవారిని నియమించాలని ఆదేశించారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ కొత్త చైర్మన్ ఎవరో చెప్పాలన్నారు. అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమ్మతించారు. కమిషన్ కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని ధర్మాసనానికి వివరించారు.