Bangalore-Chennai : బెంగళూరు-చెన్నై గ్రీన్ ఫీల్డ్ హైవే సిద్ధం
Bangalore-Chennai : బెంగళూరు-చెన్నై గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారి సిద్ధమైంది. ఈ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.17,930 కోట్లు వ్యయం చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ రహదారి కర్నాటకలో 110 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ లో 65 కి.మీ., తమిళనాడులో 105 కి.మీ. నిర్మించారు. ప్రస్తుతం చెన్నై-బెంగళూరు మధ్య దూరం 360 కి.మీ. కానీ ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల దాదాపు 80 కి.మీ. దూరం తగ్గింది. రహదారి నిర్మాణంతో బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం ఐదు గంటల్లో చేరుకోవచ్చు.
రహదారికి ఇరువైపులా పారిశ్రామిక వాడలను అభివృద్ది చేస్తారు. ఇప్పటికే బెంగళూరు రూరల్ జిల్లాలో నరసాపుర పారిశ్రామిక వాడ, కోలారు, ముళబాగిలు, గమక పారిశ్రామిక వాడలు మరింతి వృద్ధి చెందనున్నాయి. రవాణా వ్యవస్థ ఉన్నందున పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హోసకోట శివార్ల నుంచి దేవనహళ్లి, హోసూరు, తుమకూరు తదితర ప్రాంతాలకు వెళ్లే విధంగా రింగ్ రోడ్డు వంతెనలను నిర్మించారు. వాహనాలు ఎక్కడా ఆగకుండా సంచరించే విధంగా రహదారిని అభవృద్ధి చేశారు. కోలారు, చిత్తూరు ప్రాంతాలతో పాటు పారిశ్రామిక వాడల నుంచి నేరుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విధంగా రహదారిని అభివృద్ధి చేశారు. ఈ హైవే వల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.