YS Jagan : మరోసారి బెంగళూరుకు వైఎస్ జగన్.. కారణం ఇదేనని చెబుతున్న వైసీపీ
YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువశాతం పులివెందుల, బెంగళూరులోనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరుకు వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఈ వరుస పర్యటనల మర్మం ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన తన కాలికి ట్రీట్మెంట్ కోసం ఆయన బెంగళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది.. వారం పాటూ అక్కడే ఉంటారని చెబుతున్నారు.
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అనేది కూడా చూడాలి. అసెంబ్లీకి హాజరుకావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం అందలేదు. కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళుతున్నారనే ప్రచారంతో.. అసెంబ్లీకి వస్తారా?.. విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలి. వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలోని నివాసంలో ప్రజా దర్భార్ నిర్వహించాలని భావించారు. వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు.. కానీ బెంగళూరు పర్యటనతో వాయిదా వేశారు. ఇంత సడెన్ గా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని జగన్ బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ దాడి తీవ్రతరం చేసిన వేళ ఆయన బెంగళూరు ట్రిప్ హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత వైఎస్ జగన్ తొలిసారి జూన్ 22న తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా పులివెందులలో మూడురోజులు అక్కడే ఉన్నారు. అలాగే సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత తన పులివెందుల పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని బెంగళూరులోని ఎలహంకలోని తన నివాసానికి వెళ్లిపోయారు. అక్కడే వారం పాటూ ఉన్న జగన్ ఆ తర్వాత విజయవాడకు వచ్చారు. సోమవారం బెంగళూరుకు వెళ్తున్న జగన్ వారం రోజులపాటు అక్కడే ఉంటారని అంటున్నా.. వచ్చే వారం నాటికీ రాష్ట్రానికి వచ్చి అసెంబ్లీకి వెళ్తారా..? లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.